డ్యూటీలో బీ కేర్‌ఫుల్.. కులం, మతం చూడొద్దు : కేసీఆర్

by Shyam |   ( Updated:2021-02-11 13:22:55.0  )
డ్యూటీలో బీ కేర్‌ఫుల్.. కులం, మతం చూడొద్దు : కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘మంచిగ ఉంటేనే బట్ట కాల్చి మీదేసే రోజులివి. చాలా జాగ్రత్తగా ఉండాలె. పదవిలో ఉన్నొళ్లు చాలా సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలె. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ ఉండదు. అవి కొన్నిసార్లు వికటించే అవకాశం ఉంటది. మీ దగ్గరికొచ్చెటొళ్ల కులాన్ని, మతాన్ని చూడొద్దు. అందరినీ ఆదరించాలె. వాళ్లకు సరైన గౌరవం ఇయ్యాలె. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలె’ అని జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కర్తవ్యబోధ చేశారు.

గురువారం జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతారెడ్డి ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసిన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇంతమంది కార్పొరేటర్లున్నా, అర్హతలు ఉన్నవారున్నా ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుందని, అందరికీ ఇవ్వలేమని, ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రజల మన్ననలను చూరగొనాలని కోరారు. ‘పార్టీ అధ్యక్షుడిగా నేనున్న పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలె. గోరటి వెంకన్న రాసిన గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అనే పాట వినండి. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నయి.

మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలె. వారి బాధలను అర్థం చేసుకోవాలె. బస్తీ సమస్యలు తీర్చాలె’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలో సింథ్ కాలనీ, గుజరాతీ గల్లీ, పార్సీగుట్ట లాంటి అనేక కాలనీలు, గల్లీలు ఉన్నాయని, వీటికి తోడు బెంగాలీలు, మలయాళీలు, మార్వాడీలు, ఖాయస్తులు.. ఇలా విభిన్న ప్రాంతాల, విభిన్న మతాల, విభిన్న సంస్కృతులకు చెందినవారున్నారని గుర్తుచేశారు. వారంతా హైదరాబాదీలుగానే గర్విస్తున్నారని, ఈ నగరం ఓ మినీ ఇండియాలాగా అందరినీ ఆదరించే ప్రేమ కలిగినదిగా వర్ధిల్లుతోందన్నారు. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నదని, గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలని వారికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed