ప్రభుత్వ అధికారం..ప్రైవేట్ కంపెనీలకు..!  

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని, విద్యుత్ సంస్థలు పోతే.. ఉద్యోగులు ఏమి కావాలి..? క్రాస్ సబ్సిడీ చేయలేం. ఈఆర్‌సీ మనచేతిలో ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసన సభలో చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో తెలంగాణ విద్యుత్ రంగం సాధించిన విజయాలు, కేంద్రం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ చట్టం, శ్రీశైలం ప్రమాద సంఘటనలపై సభలో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఎవ‌రున్నా రాష్ట్రాల హ‌క్కులను హ‌రిస్తున్నారని, విద్యుత్ రంగం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటే డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కో అభివృద్ధి చెందుతాయనీ, ఈ సంస్థ‌లు లేకుండాపోతే వేల ఉద్యోగాలు పోతాయని ఆయన తెలిపారు.

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన చ‌ట్ట సవరణ బిల్లు న‌మూనాను కూడా పంపించారనీ, ఈ నేప‌థ్యంలోనే తాను కేంద్రానికి లేఖ రాశానని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ప‌రిపాలించే విధానంలో వారి దృక్పధం పాజిటివ్‌గా లేదని, అంబేద్కర్, ఇత‌ర గొప్ప వ్య‌క్తులు ప్ర‌వేశ‌పెట్టిన ఆదేశిక సూత్రాల‌ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. “కేంద్ర విద్యుత్ చ‌ట్టం వ‌స్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వ‌స్తాయనీ, ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీల‌కు అప్ప‌గిస్తారనీ, కేంద్ర విద్యుత్ చ‌ట్టంలో అనేక లోపాలు ఉన్నాయ‌ని” కేసీఆర్ అన్నారు. కొత్త చ‌ట్టం ప్ర‌కారం పొలంలోని ప్ర‌తి బోరుకు మీట‌ర్లు పెట్టాల్సి వ‌స్తుంద‌న్నారు. కొత్త మీట‌ర్ల కోసం రూ.700 కోట్లు కావాల‌న్నారు. మీట‌ర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కు పిండి వ‌సూలు చేస్తారనీ, రాష్ర్టంలోని 26 ల‌క్ష‌ల బోర్ల‌కు మీట‌ర్లు పెట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేత‌లు ఒప్పుకుంటారా? అని సీఎం ప్ర‌శ్నించారు. కేంద్రం తెచ్చే చ‌ట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఏకగ్రీవంగా తీర్మానం..

‘‘కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం -2003 సవరణ బిల్లును తెలంగాణ శాసన సభ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు పేదప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టంను రుద్దవద్దని కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది”. అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే సందర్భంలో తీవ్ర వత్తిడి తీసుకొచ్చారని, ప్రైవేట్‌కు కేటాయించాలని సూచించారని, అయినా నేను వినకుండా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 135 కోట్లు జనాభా ఉన్న దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందనీ, 45 వేల టీఎంసీలే వాడుతున్నామని, అయినా, చెన్నైలాంటి నగరం తాగునీటి కోసం ఎందుకు అలమటిస్తున్నదని, దేశంలో తాగు, సాగునీటి ఇబ్బందులెందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించిన కార‌ణంగా విద్యుత్ బిల్లులు రికార్డు చేయ‌లేదనీ, ఆ స‌మ‌యంలో అధికంగా వ‌చ్చిన విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆ మూడు నెల‌లు డివైడ్ చేసి ఏదైనా భారం ప‌డితే తొల‌గిస్తామ‌ని హామీ ఇస్తున్నాం. అటువంటి భారం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నివ్వ‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

విద్యుత్‌ను కొనాలి.. ఉత్పత్తిని తగ్గించాలి..

దేశంలో ఉత్పత్తి 4 లక్షల మెగావాట్లుంటే వాడకం 2.19 లక్షల మెగా వాట్లేనని, మిగులు 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వాడుకోలేని పరిస్థితి దేశంలో ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కొత్త చట్టం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలి లేదా విద్యుత్‌ను కొనాలి. ప్రతి యూనిట్‌కు 50 పై.ల నుంచి రూ.2 వరకు భారం పెరుగుతుందని సీఎం తెలిపారు. సబ్ లైసెన్స్‌లు ఇస్తారని, మన దగ్గర నియంత్రణ ఉండదని, ప్రజలకు ఏరకంగా పనికిరాదని, రైతాంగానికి గొడ్డలిపెట్టని, రాష్ట్రాల అధికారాలను హరించే నియంతృత్వ చట్టం, సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతం కలిగించేదిగా ఈ చట్టం ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయ్యా..! మీకు బలం ఉంటే ఉండొచ్చుగాక ఈ బిల్లు వద్దని చేతులెత్తి దండంపెట్టి చెప్పుతున్న నరేంద్రను వేడుకుంటున్నాను.. బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రజల నెత్తిమీద రుద్దరాదని సభాముఖంగా చెప్పారు.

నిర్వహణ భారం పెరుగుతుంది – జగదీశ్వర్ రెడ్డి

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యుత్ చట్టంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలను సంప్రదించాకే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కొత్త చట్టంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి వస్తోందని, మీటర్ల తయారీ వ్యయం డిస్కంలకు పెనుభారంగా మారుతుందన్నారు. కొత్త చట్టంతో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే అవకాశం ఉందని, క్రాస్ సబ్సిడీ విధానం పాటిస్తున్న తెలంగాణకు అదనపు భారం కానుందని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దానికితోడు గ్రిడ్‌ల నిర్వహణ భారం కూడా పెరుగుతుందని తెలిపారు.

కొత్త చ‌ట్టం మేర‌కు లైసెన్స్ ఉన్న సంస్థ‌లు ఎక్క‌డైనా విద్యుత్ కొని ఎవ‌రికైనా అమ్మ‌వ‌చ్చునని, తెలంగాణ రాష్ర్టంలో విద్యుత్ రంగంలో అనేక‌మైన విజ‌యాలు సాధించాం. అన్ని రంగాల‌కు నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. నాడు క‌రెంట్ కోత‌లు, ప‌వ‌ర్ హాలిడేలు ఉండేవి. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మిగులు విద్యుత్ రాష్ర్టంగా మారిందన్నారు. దేశంలో అత్య‌ధిక విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక విద్యుత్ ఉద్యోగుల‌కు రెండు సార్లు వేత‌నాలు పెంచామ‌ని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి అన్నారు. కంట్రోల్ ప్యానల్స్ లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో విధుల్లో ఉన్న సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేదనీ తెలిపారు. అగ్నిప్ర‌మాదం వ‌ల్ల 9 మంది విగ‌త‌ జీవుల‌య్యారని వెల్లడించారు. వారి కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని తెలిపారు. మ‌ర‌ణించిన ఏడుగురు కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం క‌ల్పించేలా చూడాల‌ని జెన్‌కోకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. శ్రీశైలం ప్ర‌మాదంపై సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించామ‌ని మంత్రి తెలిపారు.

Advertisement