- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబాయ్‌కి షాకిచ్చిన జగన్… రెండున్నరేళ్లు అంతేనా..?
దిశ, ఏపీ బ్యూరో: బాబాయ్ ఆశలపై అబ్బాయ్ నీళ్లు చల్లారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిన చందంగా బాబాయ్ పరిస్థితి మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన అనుచరులకు న్యాయం చేయాలని భావిస్తున్న బాబాయ్‌ను మళ్లీ రెండున్నరేళ్లపాటు బయటకు రాకుండా ఇరికించేశాడు అబ్బాయ్. ఇంతకీ ఎవరు బాబాయ్.. ఎవరు అబ్బాయ్ అనుకుంటున్నారా..? ఇంకెవరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్… వైవీ సుబ్బారెడ్డిలు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి స్వయాన చిన్నాన్న. వైఎస్ మరణం… జగన్ జైలుపాలైన తర్వాత ఒకవైపు పార్టీ బాధ్యతలతోపాటు కుటుంబ బాధ్యతలను సైతం మోశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఉభయ గోదావరి జిల్లాలే కాదు.. ప్రకాశం జిల్లాలోనూ తన ప్రాబల్యంతో వైసీపీ గెలుపునకు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు వెళ్లాలని వైవీ సుబ్బారెడ్డి భావించారు. అయితే సీఎం జగన్ బాబాయ్ ఆశలను వమ్ము చేశారు. టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారు. టీటీడీలో కీలక మార్పులు చేశారు.
టీటీడీ పాలకవర్గం రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో ఈసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించారు. తనను నమ్ముకున్న వారికి గత రెండేళ్లుగా ఏమీ చేయలేకపోయానని రాబోయే మూడేళ్లలో న్యాయం చేయాలని భావించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతానని.. వీలుంటే రాజ్యసభకు పంపాలని సీఎం జగన్‌ను కోరినట్లు ప్రచారం జరిగింది. రాజ్యసభకు పంపని నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కనీసం కేబినెట్‌లో అయినా చోటివ్వాలని కోరినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి.
దీంతో తమ నాయకుడు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఆయన అనుచరులు సంబరపడ్డారు. ఇంతలో సీఎం జగన్ పిడుగు వేశారు. శనివారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో వైవీ సుబ్బారెడ్డిని తిరిగి టీటీడీ చైర్మన్‌గా నియమించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆయన అనుచరులు షాక్‌కు గురయ్యారు. తమ నాయకుడు మరో రెండున్నరేళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనా అంటూ పెదవి విరుస్తున్నారు.
2019 నుంచి అంతా రివర్స్
వైవీ సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఒంగోలు ఎంపీగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పారు. అనంతరం పార్టీ వ్యవహారాల్లోనూ కీలకంగా మారారు. వైసీపీలో నెంబర్ 2 అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయనకు సీఎం జగన్ హ్యాండ్ ఇచ్చారు. 2019లో టికెట్ నిరాకరించారు. టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలో చేరడంతో ఆయన కోసం ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి త్యాగం చేయాల్సి వచ్చింది. అబ్బాయ్ జగన్ కోరికపై తప్పక కష్టంగానే వదులుకున్నారు.
ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చాక రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకుంటారని బాబాయ్ ఆశించారు. అది కూడా జరగలేదు. ఆయన్ను టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. ఇటీవలే ఆ పదవి ముగియడంతో ఈసారైనా రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారని ఆశించిన ఆ ఆశలు కూడా నెరవేరలేదు. రెండోసారి అయిష్టంగానే టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతారా లేక జగన్‌తో చర్చించి పెద్దల సభకు వెళ్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.