ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |
ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఓటీఎస్‌ విధానం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఓటీఎస్ ద్వారా ఇంటిపై అన్ని రకాలుగా సంపూర్ణ హక్కులు వర్తింపజేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధానం అమలు చేసినట్లు ప్రభుత్వం చెప్తుంటే… ఓటీఎస్ చెల్లించొద్దని టీడీపీ చెప్తోంది. దీంతో ఈ ఓటీఎస్ విధానంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద రచ్చే జరుగుతుంది. ఇలాంటి తరుణంలో విమర్శలకు చెక్ పెట్టేలా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్ ద్వారా పేద ప్రజలకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇది పూర్తి స్వచ్ఛందమని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఓటీఎస్ విధానంపై క్లారిటీ ఇచ్చారు. ఓటీఎస్‌ పథకం ద్వారా ఇంటిపై అన్ని రకాలుగా సంపూర్ణ హక్కులు లభిస్తాయన్నారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందని.. దీనిని అవసరాలకు అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా..? తిరస్కరించాలా..? అనేది ప్రజలకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాలను పట్టించుకోవద్దని.. ఇది ప్రజలకు మేలు చేసేదేనని స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు జారీ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed