సుపరిపాలనకే గ్రామ సచివాలయం: జగన్

by srinivas |
సుపరిపాలనకే గ్రామ సచివాలయం: జగన్
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఈనేపథ్యంలో తమ పరిపాలనపై 6 రోజుల మేథోమధన సదస్సు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో లబ్ధిదారులు, నిపుణులతో సీఎం క్యాంపు కార్యాలయంలో సదస్సు జరుగుతోంది. సదస్సును ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ..

సుమారు 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర సాగిన తన పాదయాత్రలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని సీఎం జగన్ చెప్పారు. వ్యవస్థలో మార్పు తీసుకొస్తేనే తప్ప ప్రజలను ఆదుకోలేమనే భావన కలిగిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకువచ్చామని, ఆ వ్యవస్థే… గ్రామ సచివాలయ వ్యవస్థ అని అన్నారు.

గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశామని చెప్పారు. అంతేగాకుండా, సంవత్సర కాలంలోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.

గ్రామ సచివాలయ వ్యవస్థలో అవినీతి లేదని, ఇది ఎంతో పారదర్శకమైన వ్యవస్థ అని తెలిపిన సీఎం జగన్, గ్రామ సచివాలయ వ్యవస్థపై ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే అవ్వాతాతలకు పెన్షన్లు అందిస్తున్నామని, వైఎస్సార్ బీమా, వాహనమిత్ర, మత్స్యకార భరోసా వంటి పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారానే కరోనా నియంత్రణ చర్యలు చేపట్టామని, సమగ్ర కుటుంబ సర్వేలు నిర్వహించామని వివరించారు.

నూతన మద్యం పాలసీ

ఏపీ వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులు తొలగించామని చెప్పారు. మద్యం అమ్మకాల్లో ప్రైవేటు వ్యక్తులను కూడా తొలగించినట్టు వెల్లడించారు. మద్యం నియంత్రణలో భాగంగా షాక్ కొట్టే విధంగా ధరలు నిర్ణయించామని అన్నారు. దీంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు.

విద్యావిధానం

ఇక నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఊర్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం మునుపెన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. 82 లక్షల మంది విద్యార్థులకు చేయూతగా 43 లక్షల మంది తల్లుల అకౌంట్‌లో అమ్మఒడి విద్యాదీవెన కింద రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని చెప్పారు.

రైతు భరోసా

రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఈ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. అలాగే గ్రామంలోని భూసారాన్ని అనుసరించి ఏఏ పంటలు వేయాలో నిపుణుల సలహాలిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. అలాగే పండిన పంటల విక్రయానికి అనువుగా గ్రామాల్లో జనతా బజార్లను తీసుకొస్తామని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం మేనిఫెస్టోను పూర్తి చేశామని జగన్ అన్నారు. 2019 జూలై 8న వైఎస్సార్ పెన్షన్ కానుకు ప్రారంభించి, గతంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే..తాము 55 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 69 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. అన్ని పథకాలు గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటికే చేరుస్తున్నామని ఆయన చెప్పారు. మహిళల భద్రతకు దిశ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. 81 వేల మంది చేనేతలకు రూ.24 వేల చొప్పున సాయం చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed