ప్రతీ మహిళతో "దిశ"యాప్ డౌన్‌లోడ్ చేయించండి: సీఎం జగన్

by srinivas |   ( Updated:2021-06-23 06:08:07.0  )
ప్రతీ మహిళతో దిశయాప్ డౌన్‌లోడ్ చేయించండి: సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళల భద్రతపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. బుధవారం హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు సీఎంఓ అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కల్పించడతోపాటు..యాప్‌ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై వారికి పూర్తి అవగాహన కల్పించాలని, దీన్ని ఒక డ్రైవ్‌గా చేపట్టాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా దిశ యాప్‌ వినియోగంపై అవగాహన పెంచాలన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలని పలు సూచనలు చేశారు. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చుకోవాలని సీఎం జగన్ సమావేశంలో ఆదేశించారు.

Advertisement

Next Story