తాజా మంత్రి, మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు

by Shyam |
తాజా మంత్రి, మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ టీఆర్ఎస్‌లో రెండు వర్గాల మధ్య లొల్లి తారాస్థాయికి చేరింది. జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డిలు వారం రోజులుగా ’ఛాంబర్‘ రాజకీయానికి తెరలేపారు. ఘట్‌కేసర్ ఎంపీపీ ఆఫీస్‌లో శరత్ కు ఛాంబర్ కేటాయిస్తుండగా.. సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. వీరిద్దరి పంచాయితీ మంత్రులతో పాటు ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. పరిష్కారం కాకపోవడంతో ఇరు నేతల మధ్య విబేధాలు భగ్గు మన్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఎంపీపీ సుదర్శన్ రెడ్డిపై మరో వర్గం దాడికి దిగింది. దీంతో ఎంపీపీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా, తనపై ఎంపీపీ వర్గమే దాడి చేసిందంటూ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అనుచరులు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విబేధాలు మేడ్చల్ జిల్లాలో హాట్ టాఫిక్ గా మారాయి.

రెండు గ్రూపులు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పక్కన బెట్టిన అధిష్టానం, ఎంపీగా కొనసాగుతున్న మల్లారెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో వీరిద్దరి మధ్య అప్పటి నుంచే రాజకీయ వైరం నడుస్తోంది. నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి వర్గం, మల్లారెడ్డి వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయారు. ఘట్ కేసర్ జెడ్పీటీసీగా ఎన్నికైన సుధీర్ రెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి మేడ్చల్ జెడ్పీ చైర్మన్ పీఠాన్నికైవసం చేసుకున్నాడు. కాగా సుధీర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న ప్రస్తుత ఘట్ కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఇతర పార్టీల మద్దతుతో ఎంపీపీ పదవిని దక్కించుకుని, మల్లారెడ్డి వర్గంలో చేరిపోయాడు. ఎంపీడీవో ఆఫీస్‌లో తనకు ఛాంబర్ కేటాయించాలని జెడ్పీ చైర్మన్‌ పట్టుబడుతుండడంతో ఎంపీపీ ఆందోళనకు దిగారు. ఈ వివాదం మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, కలెక్టర్ ల దృష్టికి కూడా వెళ్లింది. కాగా, ఎంపీపీ సుదర్శన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ అవుషాపూర్ గ్రామంలో న్యాయం జరిగేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్, ఉప సర్పంచ్ లు వినతి పత్రం ఇచ్చి, నల్లా బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed