వైసీపీ గెలిచిందంతా దొంగ ఓట్లతోనే.. చింతామోహన్ ధ్వజం

by srinivas |
mohan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో దొంగ ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో గెలుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. గుంటూరులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ప్రాంతమైన కుప్పం వెళ్లి ఓట్లు వేయించుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంక్రాంతిలోపు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి క్యాప్టలిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో పెట్రోల్, డిజిల్, గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెబుతున్న ప్రధాని మోడీ ఏకంగా రూ. 16 వేల కోట్లతో రెండు విమానాలు కొనుగోలు చేసి విలాస జీవితం గడుపుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story