బంగ్లాదేశ్‌‌కు చైనా బుజ్జగింపు..కుట్రలో భాగమేనా!

by  |
బంగ్లాదేశ్‌‌కు చైనా బుజ్జగింపు..కుట్రలో భాగమేనా!
X

న్యూఢిల్లీ: భారత్‌ చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో జిత్తుల మారి డ్రాగన్ కొత్త ఎత్తులు వేస్తున్నది. మన దేశంతో సన్నిహితంగా ఉండే దేశాలను తనవైపుకు తిప్పుకోవాలని కొత్త పన్నాగానికి తెరతీస్తోంది. ఈ క్రమంలోనే ఇండియాతో మంచి రిలేషన్ కలిగియున్న నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాల్లో పెట్టుబడుల పేరుతో బిలియన్ డాలర్లు కుమ్మరిస్తోంది. మన పక్కనే ఉంటూ బల్లెంలా మారిన శత్రుదేశం పాకిస్థాన్‌‌తోనూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. భారత్ మీద విషం చిమ్మడానికి పాక్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది కావున, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను ఇక్కడ బాగా వాడుకుంటోంది. అందువల్లే ఆ దేశంతో సీపీఈసీ ప్రాజెక్టు పేరుతో కలిసి అడుగులు వేస్తోంది.ఇన్ని చేస్తున్న డ్రాగన్ దేశం కన్ను ఇప్పుడు బంగ్లాదేశ్‌పై పడింది.

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశమైన బంగ్లాదేశ్‌ను మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతోంది.ఈ నేపథ్యంలోనే బంగ్లాకు ఎగుమతి చేసే 5,161 రకాల వస్తువులపై టారిఫ్‌ను 97 శాతం రద్దు చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. తక్కువ అభివృద్ధి చెందిన దేశంగా తమను పరిగణించి మేము దిగుమతి చేసుకునే వివిధ వస్తువులపై టారిఫ్‌లను రద్దు చేయాలని బంగ్లా చైనాను కోరింది. ఇక్కడ చిత్రం ఎంటంటే ఇన్ని రోజులు మౌనం వహించిన కమ్యూనిస్టు దేశం..లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్ సైనికులపై చైనా సైనికులు దాడి చేసిన మర్నాడే, అంటే జూన్ 16న ఈ టారిఫ్‌ల రద్దుపై నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నదని బంగ్లా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అంతేకాకుండా బంగ్లా ఉత్పత్తులు కొన్నింటిపైన టారిఫ్‌లను పూర్తిగా తొలగిస్తూ, మరికొన్నిటిపై 97 శాతం టారిఫ్ రద్దు చేస్తూ బీజింగ్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జూన్ 16న విడుదల అయ్యిందని వెల్లడించింది.


Next Story

Most Viewed