ఖాళీ కడుపుతో కాఫీ తాగినా.. మద్యం సేవించినా ఇక అంతే..

by Shyam |
ఖాళీ కడుపుతో కాఫీ తాగినా.. మద్యం సేవించినా ఇక అంతే..
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే వ్యాయమం చేస్తే ఆ రోజంతా శరీరం యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిన విషయమే. అయితే వ్యాయమంతో పాటు పొద్దున మొదటిసారి తీసుకునే ఫుడ్ పట్ల జాగ్రత్త వహించడం కూడా చాలాముఖ్యం. రాత్రి తిని పడుకున్న తర్వాత మళ్లీ ఉదయం ఆహారం తీసుకోవడానికి 7-8 గంటల గ్యాప్ ఉంటుంది. అందువల్ల నిద్రలేవగానే ఖాళీ కడుపుతో పనులు చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని, ఫేమస్ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పూజ మఖిజా చెబుతోంది. తన సోషల్ మీడియా ఖాతాలో ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను పంచుకోవడంతో పాటు, ఖాళీ కడుపుతో చేయకూడని కొన్ని విషయాలను ఆమె లిస్ట్ అవుట్ చేసింది.

కెఫిన్..

ఉదయం లేవగానే ఓ కప్పు టీ/కాఫీ తాగితేనే శరీరం ఉత్సాహంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. ఒక్క రోజు అది మిస్ అయితే ఏదో లోటుగా ఉందని భావిస్తాం. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుందని మఖిజా అంటున్నారు. అందువల్ల ఎంప్టీ స్టమ‌క్‌తో తొలిగా తీసుకునే ఆహారం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆమె సూచిస్తుంది.

మద్యం..

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ తాగడం మాత్రం మానడానికి ఎంతోమంది ఇష్టపడరు. కొందరు రాత్రి ఫుల్‌గా తాగి, ఉదయం లేవగానే హ్యాంగోవర్ పెగ్ అంటూ తాగేస్తారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే.. అది నేరుగా రక్తప్రవాహంలోకి వెళుతుందని ఆమె అన్నారు. ఆల్కహాల్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన తర్వాత అది వేగంగా శరీరమంతా వ్యాపించి రక్త నాళాల్లోకి వెళుతుంది. ఇది కడుపు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, ఆపై మెదడుకు ప్రయాణిస్తుంది. దీంతో తాత్కాలికంగా వెచ్చదనంతో పాటు పల్స్ రేటులో తాత్కాలిక తగ్గుదల, రక్తపోటు ఏర్పడుతుంది. అవయవాల పనితీరుపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి తాగే ఆల్కహాల్‌లో దాదాపు 20 శాతం పొట్ట గుండా వెళుతుంది. ఒక నిమిషం లోపలే మెదడుకు చేరుతుంది. అదే కడుపులో ఆహారాన్ని కలిగి ఉండటం వలన ఆల్కహాల్ రక్తప్రవాహంలో ప్రయాణించే నష్టాన్ని కొంతమేర తగ్గిస్తుందని మఖిజా పేర్కొంది.

చూయింగ్ గమ్..

ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం కూడా అంత మంచిది కాదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మరింత జీర్ణ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. యాసిడ్ పొట్టలోని లైనింగ్‌ని నాశనం చేయగలదు. ఎందుకంటే కడుపులో ఆహారపదార్థాలు లేనందున అల్సర్ ఏర్పడుతుంది.

షాపింగ్..

ఖాళీ కడుపుతో షాపింగ్ చేసే వ్యక్తులు అవసరమైన దానికంటే ఎక్కువ షాపింగ్ చేయడమే కాకుండా ఎక్కువ కేలరీల ఆహారం, ఎక్కువ జంక్ ఫుడ్ కొనుగోలు చేస్తారని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధనా బృందం అధ్యయనాల్లో వెల్లడైంది.

వాదించవద్దు..

బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా మనిషి కోపోద్రిక్తుడవుతాడు. ఆకలిగా ఉన్న సమయంలో కొద్దిగా కదిలించిన అంతెత్తున లేవడానికి కూడా కారణం ఇదే. అందువల్ల అల్పాహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కోపాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. అంటే తదుపరి గొడవ పడుతున్నప్పుడు లేదా ఇంకేదైనా చర్చించే ముందు ఏదైనా తినాలని గుర్తుంచుకోండి.

నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ డ్రగ్స్ (NSAID )

ఎప్పుడైనా సరే తిన్న తర్వాతే NSAID లను తీసుకోవాలి. వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఈ మందులు GI(గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసీజెస్) ట్రాక్ట్‌ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు. గ్యాస్ట్రిటిస్, ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్, రక్తస్రావం, పూతల వంటివి NSAIDల నుంచి ప్రత్యేకించి దీర్ఘకాలికంగా, ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు వచ్చే సమస్యలని ఆమె తెలిపారు.

Advertisement

Next Story