ఇందూరు గడ్డ.. లాటరీల అడ్డా..

by Shyam |   ( Updated:2020-02-18 02:55:32.0  )
ఇందూరు గడ్డ.. లాటరీల అడ్డా..
X

దేశంలో ‘లక్కీ లాటరీ’ నిర్వహణను నిషేధించిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. లాటరీలు, లక్కీ లాటరీలు, గొలుసుకట్టు సంస్థలు( మనీ సర్య్కులేషన్ స్కీమ్స్) నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపే. నిజామాబాద్ జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా నడుస్తున్న ‘లక్కీ లాటరీ స్కీమ్‌లు’ చూస్తే మరోకోణం కూడా కనిపిస్తుంది. అది కూడా జిల్లా కేంద్రంలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఈ దందా కొనసాగుతుండటం గమనార్హం.

ఎంటర్‌ప్రైజెస్‌ల పేర(గృహావసర సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్) వస్తువుల అమ్మకాలకు అనుమతి తీసుకుని లక్కీ లాటరీల దందాలను నిర్వహిస్తున్నారు. ఈ తరహా లాటరీ స్కీముల్లో ప్రతినెలా రూ.1,000 నుంచి 15,00 చెల్లించాల్సి ఉంటుంది. లక్కీగా నెంబర్ తగిలితే కేటాయించిన గిఫ్ట్‌లు అందజేస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న ఈ దందా ఇఫ్పుడు శాఖోపశాఖలుగా పొరుగు జిల్లాలకు విస్తరించింది. జిల్లా కేంద్రంలోని 30 ఎంటర్‌ప్రైజెస్‌లు.. సుమారుగా 30 వేల మంది సభ్యులను చేర్చుకుని ప్రతినెలా లక్కీ లాటరీలను నిర్వహిస్తున్నాయి. నగరంలోని బోధన్ రోడ్‌లో గల షైన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 3 వేల మంది, జనతా ఎంటర్‌ప్రైజెస్‌లో 3 వేలమంది వరకు సభ్యులున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. లక్కీ డ్రాలో కార్లు, బైక్‌లతోపాటు బంగారు ఆభరాణాలను ఆశజూపి కూలీ నాలీ చేసుకునే పేదలను, మధ్య తరగతి ప్రజలను తమలో బుట్టలో వేసుకుంటున్నారు. 12, 24, 30 నెలలు టార్గెట్‌గా లక్షల రూపాయలను పోగేసుకుంటున్నారు. పైగా ప్రతినెలా కొత్తకొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిజామాబాద్, బోధన్, భైంసా, నిర్మల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల జిల్లాల నుంచి ఈ లాటరీ వసూళ్లు ప్రతినెలా రూ.కోట్లకు చేరుకుంటున్నాయి.

లాటరీలో తగిలితే కార్లు, బైక్‌లు, బంగారు ఆభరణాలు ఇస్తామంటూ నిర్వాహకులు ఆశచూపుతుంటారు. కానీ, ఇప్పటి వరకు ఎవరికీ కార్లు, బైక్‌లు, బంగారు ఆభరణాలు ఇవ్వకపోవడం గమనార్హం. లక్కీ డ్రా రోజున సభ్యులకు గృహావసర సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి నెలా 1,000-1,500 వరకు చెల్లిస్తున్న సుమారు 30 వేల మంది నెత్తిన ఏ క్షణమైనా నిర్వాహకులు టోపీ పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పోలీస్ శాఖ అడపాదడపా నిర్వాహకులపై పిట్టీ కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సంస్థలపై అడిషనల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారికి సుమోటో కేసులు నమోదు చేసే అవకాశమున్నా ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. ఏదైనా సంస్థ బోర్డు తిప్పేసి బాధితులు రోడ్డెక్కేంత వరకు పోలీస్ శాఖ స్పందించదా? అనే వాదనలకు పోలీసుల తీరుబలం చేకూరుస్తోంది. ఇటీవల షైన్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులపై పోలీసులు నామ్ కే వాస్తే కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story