ఆన్‌లైన్ గురుపూజోత్సవం!

by  |
ఆన్‌లైన్ గురుపూజోత్సవం!
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 5.. సాధారణ రోజుల్లో విద్యార్థులందరూ తమ గురువులను పూజించడానికి పూల దండలు, శాలువాలు రెడీ చేస్తూ ఆత్రుతగా, ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా పుణ్యమాని విద్య ఆన్‌లైన్‌కు పరిమితమైంది. పాఠాల సంగతి పక్కన పెడితే, ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో గురువును పూజించుకునే అవకాశాల గురించి పిల్లలు పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం మీకు పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్ మాత్రమే గురువు కాదని, మనకు జీవితంలో మంచి పాఠాలు నేర్పిన ప్రతి ఒక్కరూ గురువేనని గుర్తుంచుకోవాలి. అలాంటి గురువులకు ఈ కరోనా కాల గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఎలా తెలపాలో కొన్ని దారులు మీకోసం!

కష్టపడే గురువుకి తోచిన బహుమతి..

ఈ కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు జీతాలు లేవు, సేవింగ్స్ లేవు. దీంతో జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వారు ఆన్‌లైన్ క్లాసులు ఎలా చెప్పాలో నేర్చుకుని మరీ, ఇంట్లో ఉండి కష్టపడుతూ ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నారు. అలాంటి గురువుకు మీ వంతు సాయంగా ఏదైనా ఇవ్వవచ్చు. విద్యార్థి ఎంత డబ్బున్నవాడైనా నిజమైన గురువు పెద్ద పెద్ద బహుమతులను తీసుకోవడానికి అంగీకరించడు. కాబట్టి మీకు ఉన్నంతలో ఆ గురువును సత్కరించడానికి ఏదైనా చిన్న ప్రయత్నం చేయండి.

గురువుకు గుర్తింపునిచ్చే పోస్ట్..

లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు వాళ్లకు ఉన్నంత స్థాయిలో, వారికి ప్రతిభకు తగినట్లుగా చేతనైన పనిలోకి అడుగుపెట్టారు. ఓ వైపు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తూనే మరోవైపు ఉపాధి కోసం వేరే పనులు చేస్తున్నారు. అలాంటి గురువులు కొంతమంది గురించి పేపర్‌లలో, ఇంటర్నెట్‌లో చూసే ఉంటారు. మీకు తెలిసి కూడా అలా కష్టపడుతున్న గురువులు ఉంటే వారి గురించి మీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ పోస్ట్‌లు చేయండి. వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి మీకు వారి మీద ఉన్న గౌరవాన్ని తెలియజేయండి.

ఆన్‌లైన్ గురువులు కూడా గురువులే..

కేవలం పాఠాలు చెప్పే వాళ్లు మాత్రమే కాదు.. ఆన్‌లైన్‌లో కోడింగ్ పాఠాలు, సంగీత పాఠాలు, ఇంకా ఇతర అంశాలను నేర్పించే వాళ్లు కూడా గురువులే. పాఠశాలలు ఆన్‌లైన్ విద్య ప్రారంభించడానికి ముందే ఆసక్తి గల విద్యార్థులు అందరూ తమకు నచ్చే అంశాల గురించి నేర్చుకోవడానికి యూట్యూబ్‌ను వేదికగా మార్చుకున్నారు. ఇంటి పంట, మిద్దెతోటలు ఎలా వేయాలని నేర్చుకున్నారు. అమ్మాయిలు బ్యూటీ టిప్స్ నేర్చుకున్నారు. ఇంకా కొందరైతే కోడింగ్ నేర్చుకున్నారు. ఇలా నేర్పిన వారు కూడా గురువులే కాబట్టి వారి వీడియో కింద ‘హ్యాపీ టీచర్స్ డే’ అని కామెంట్ చేయడం వల్ల ఒక ప్రోత్సాన్ని ఇచ్చినట్లవుతుంది. కష్టపడి పాఠాలు చెప్పే గురువుకు జీతం రూపంలో పెద్ద మొత్తం దక్కకపోయినా తన విద్యార్థి నుంచి ఇచ్చే చిన్న గుర్తింపు కోట్ల రూపాయలతో సమానం. అందుకే ఈ గురుపూజోత్సవాన కొంత సమయాన్ని వారి కోసం కేటాయించి హ్యాపీ టీచర్స్ డే చెబుదాం!


Next Story