జగన్‌పై నిప్పులు చెరిగిన బాబు

by srinivas |
జగన్‌పై నిప్పులు చెరిగిన బాబు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని, ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఏపీలోని ఎనభై శాతం జిల్లాలు రెడ్ జోన్లు అని, సంబంధిత శాఖ తెలియజేసిన వివరాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన జగన్ రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తున్నారని దుయ్యబట్టారు.

కరోనా వైరస్ నివారణ చర్యలపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షలపై కేంద్రానికి, ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తూ, కాకిలెక్కలు చెబుతోందని ఆయన విమర్శించారు. జిల్లా యంత్రాంగాలు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల మధ్య తేడాలున్నాయని ఆయన తెలిపారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని, కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లను బోగస్ అంకెలతో నింపేస్తున్నారని ఆయన విమర్శించారు.

సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, ఆరోగ్యశాఖ కార్యదర్శి లెక్కలకు పొంతనలేదని ఆయన తెలిపారు. మొన్న సాయంత్రం 11,613 శాంపిల్స్ పరీక్ష చేసినట్టు డ్యాష్ బోర్టులో పేర్కొన్నారని చెప్పిన చంద్రబాబు, నిన్న ఉదయానికి 20,235 పరీక్షలు చేసినట్టు చూపించారని తెలిపారు. 12 గంటల వ్యవధిలో 8,622 పరీక్షలు ఎలా చేశారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 7 ల్యాబ్‌లలో రోజుకు 990 పరీక్షలు చేస్తామని ప్రభుత్వమే చెప్పిందన్న ఆయన.. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఎలా పరీక్షలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జగన్ దృష్టి పెట్టకపోతే అది మానవ నిర్మిత విపత్తుగా మారుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags: chandrababunaidu, ap ex-cm, tdp, ysrcp, ap,

Advertisement

Next Story

Most Viewed