వైసీపీ నేతలకు గుడి, బడి అనే తేడానే తెలియడంలేదు: చంద్రబాబు

by srinivas |
Chandhrababu1
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతల ఆరాచకాలకు గుడి, బడి అనే తేడా కూడా తెలియడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మైనారీటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసి, ఎయిడెడ్ విద్యాసంస్థల భూములను దోచుకోవడానికి వేలాది మంది జీవితాలతో ఆటలాడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తాజాగా ప్రభుత్వం కన్ను మదర్సా స్థలాలపై పడిందని విరుచుకుపడ్డారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

వక్ఫ్ బోర్డు స్థలాలను రక్షించలేని వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని లీజుకు తీసుకొని సేవా భావంతో విద్యార్దులకు విద్యను అందిస్తున్న టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నడిపించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారుల దాడి రాజకీయ కక్ష సాధింపేనని చంద్రబాబు దుయ్యబట్టారు. మైనారీటీల అభ్యునతి కోసం, వక్ఫ్ భూముల రక్షణ కోసం ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో పనిచేసే అధికారులు విచక్షణారహితంగా మదర్సాలో పిల్లల నిత్యావసర వస్తువులు, కూరగాయలు బయట పడేసిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మదర్సాను యథావిథిగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story