బోర్‌డమ్‌ అలవాటైతే సైకో లక్షణాలకు చాన్స్

by Anukaran |   ( Updated:2021-01-04 04:17:06.0  )
బోర్‌డమ్‌ అలవాటైతే సైకో లక్షణాలకు చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మానవ పుట్టుక పరమార్థం ఏంటి? తన భావాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకుని అందుకు అనుగుణంగా తన జాతి లక్షణాలను మార్చడమేనా? లేదా తనకు బోర్ కొట్టినప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఆయుష్షు పూర్తయ్యే వరకు ఎదురుచూడటమేనా? మానవ జీవితం పరమార్థం ఈ రెండింటిలో ఒకటి అనుకుంటే.. మరి అందరూ ఒకేలా చేయకుండా విభిన్నంగా ఎందుకు చేస్తున్నారు? కొందరు ధనవంతులుగా, కొందరు పేదవాళ్లుగా, కొందరు అందంగా, కొందరు అందవిహీనంగా, కొందరు తెలివిగా, మరికొందరు అమాయకంగా ఎందుకు ఉన్నారు? వీటన్నిటికీ కారణం క్రియేటివిటీ. మానవుడు తన మెదడును ఉపయోగించి అందరూ చేసే పనినే కొంచెం విభిన్నంగా చేసినప్పుడే అతని క్రియేటివిటీ బయటపడుతుంది. మరి ఈ క్రియేటివిటీ అందరికీ ఉంటుందా అంటే.. మెదడు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దాన్ని ట్రిగ్గర్ చేసి బయటికి తీసుకురావడానికి ఒక తరుణం రావాలి. అలాంటి తరుణమే బోర్ కొట్టడం. అవును.. బోర్ కొట్టడం ద్వారానే క్రియేటివిటీ బయటపడుతుందని, ఆ క్రియేటివిటీ ద్వారానే జీవితాలు మెరుగుపడుతున్నాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. మరి ఆ అధ్యయనాలు, మనలో కూడా క్రియేటివిటీ బయటకు రావాలంటే పాటించాల్సిన కొన్ని సూచనలు ఏంటో ఇవాళ్టి మోటివేషన్ మండేలో తెలుసుకుందాం.

షెర్లాక్ హోమ్స్ పాత్ర గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ కేసులు కాకుండా అతీతమైన కేసులను పరిష్కరించడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఒకవేళ అలాంటి కేసులు ఏవీ లేనప్పుడు బ్రెయిన్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి కొకైన్ మత్తుపదార్థాన్ని తీసుకుంటాడు. నేటితరానికి చెందిన చాలా మందికి రాత్రుళ్లు నిద్రపట్టకపోవడానికి కారణం ఇదే.. వారి బ్రెయిన్ యాక్టివిటీ అధికంగా ఉండటం. మరి ఇలా ఎందుకు జరుగుతుందంటే.. కారణం సోషల్ మీడియా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరో ఒకరి జీవనశైలిని చూసి మన పరిస్థితి అలా ఎందుకు లేదని బెంగపడటం, మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉండటం కారణంగా ఇలా బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. అందుకే రాత్రిళ్లు నిద్రపట్టదు. సాధారణంగా రాత్రిపూట వేరే పని చేయడానికి వీలు కాదు కాబట్టి మళ్లీ సోషల్ మీడియా బ్రౌజ్ చేయడమో, ఏదైనా వీడియోలు చూడటమో చేస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటుంటారు. మరి ఇక్కడ క్రియేటివిటీ ఎక్కడ ఉంది అని మీకు అనుమానం రావొచ్చు.

రాత్రి పూట నిద్రపోవాలి కాబట్టి ఎలాగోలా కష్టపడి నిద్రపోతారు. కానీ పగటిపూట ఇవే ఆలోచనలు వెంటాడటాన్నే బోర్ కొట్టడం అంటారు. లేదా పగటికలలు కనడం అంటారు. బోర్ కొడుతున్న పరిస్థితుల్లో ఎన్నెన్నో చేయమని మెదడు చెబుతున్నా శరీరం ఆ పనులు చేయడానికి సహకరించదు. అలాంటి క్షణాల్లో వచ్చిన కొన్ని ఐడియాలను కొద్దిగా రిస్క్ చేసి అమలు చేసే ప్రయత్నం చేస్తే అదే క్రియేటివిటీకి దారి తీస్తుంది. ఒక్కసారి ఐడియాను అమలు చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా దానికదే ముందుకు సాగుతుంది. అంటే పరోక్షంగా బోర్ కొట్టడమనేది క్రియేటివిటీకి దారితీసిందనే చెప్పవచ్చు. అయితే ఇక్కడొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. నిరంతరం ఆలోచించే వాళ్లు ఉద్యోగులుగా మిగిలిపోతారు, ఆ ఆలోచనను అమలు చేసే వాడే యజమానిగా ఎదుగుతాడు. అంతేకాకుండా ఏదైనా ఆలోచనను అమలు చేయాలని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత, ఆర్థిక సమస్యల కారణంగా వెనకడుగు వేసిన వారు ఎంతో మంది ఉంటారు. ఆ తర్వాత వారు పూర్తిగా ఆలోచించడం మానేసి బోర్‌డమ్‌ను ఒక అలవాటుగా మార్చుకుంటారు. నిజానికి ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ఆర్థిక సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే కొద్దిగా నమ్మకం, ఆశాభావం ఉండాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది.

బోర్‌డమ్ నుంచి క్రియేటివిటీ రావడమే కాకుండా కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా బోర్‌ కొట్టడం అలవాటుగా మారిన వారి మెదడు మందబుద్ధిగా మారడం లేదా వారికి సైకో లక్షణాలు రావడం లాంటివి జరుగుతాయని ఓ పరిశోధనలో తేలింది. 2014లో అమెరికన్ సోషల్ సైకాలజిస్ట్ తిమోతీ డి విల్సన్ బృందం దీని గురించి ఒక ప్రయోగం చేశారు. కొందరిని ఒక గదిలో బంధించి వారిని నిద్రపోనివ్వలేదు, ఏ పని చేయనివ్వలేదు. అలా కొన్ని గంటల పాటు ఉంచాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ గదిలో తక్కువ స్థాయిలో కరెంట్ షాక్ కొట్టే మెషిన్‌ను పెట్టారు. వ్యక్తులు ఆ గదిలోకి వెళ్లిన 15 నిమిషాలలోపే ఈ కరెంట్ షాక్ మెషిన్‌తో షాక్ కొట్టించుకోవడం మొదలుపెట్టారు. సమయం పెరుగుతున్న కొద్దీ షాక్‌ల సంఖ్య కూడా పెరిగిందని తిమోతి తెలిపారు. ఈ రకంగా బోర్ కొట్టడం అనేది ఒక మనిషిలో క్రియేటివిటీని ఉత్తేజింపజేయగలదు, అలాగే అతన్ని సైకోలాగ కూడా మార్చగలదు. కాబట్టి ఎలా మారాలనేది పూర్తిగా వ్యక్తిగతం.

Advertisement

Next Story

Most Viewed