‘ఐసోలేషన్’ సవరణలు.. కేంద్రం వివరణలు

by Shamantha N |   ( Updated:2020-05-11 07:55:14.0  )
‘ఐసోలేషన్’ సవరణలు.. కేంద్రం వివరణలు
X

న్యూఢిల్లీ: మూడో దశ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఐసొలేషన్ నిబంధనల్లో సవరణలు చేయగా, వలస కార్మికుల ప్రయాణం, ఆరోగ్య సిబ్బంది రాకపోకలపై హోంశాఖ పలు ఆదేశాలను జారీ చేసింది.
స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితులు 17 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందనీ, ఆ తర్వాత మళ్లీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. అయితే, ఐసొలేషన్ పీరియడ్ తర్వాత తమ ఆరోగ్య పరిస్థితులను జిల్లా సర్వేలెన్స్ అధికారులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండాలని తెలిపింది. పేషెంట్ కేర్‌టేకర్, అతనితో సన్నిహితంగా వ్యవహరించినవారు ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు తీసుకోవాలని సూచించింది.
ఇంతకు ముందు పాక్షిక లక్షణాలున్న పేషెంట్‌కు కరోనా లేదని సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే హోం ఐసొలేషన్ నుంచి బయటికి రావల్సి ఉండేది. కానీ, ఆ నిబంధనను తాజాగా సవరించింది.

వలస కార్మికులను కాలి నడకన పంపొద్దు

వలస కార్మికులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. వారికోసం ఉద్దేశించిన బస్సులు, శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌ల ద్వారా స్వరాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, వలస జీవులను వారి వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు ఉద్దేశించిన శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌ల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని, వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించే చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సూచనలను పక్కనబెట్టింది. వలస కార్మికులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వందల కిలో మీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు ప్రయాణం కట్టారన్న మాట వాస్తవమేనని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. కానీ, మానవతా దృక్పథంతో వారిని అడ్డుకోవాలనుకోవట్లేదని తెలిపారు.

ప్రైవేట్ క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోంలన్నీ ఓపెన్ చేయాలి

అన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోంలు ఓపెన్ చేయాలని హోం శాఖ.. రాష్ట్రాలను ఆదేశించింది. మెడికల్ ప్రొఫెషనల్స్, పారిశుధ్య కార్మికులు, అంబులెన్స్‌ల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాశారు. తద్వారా అన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, ల్యాబ్‌లు తెరిచి ఉంచేందుకు దోహదపడాలని సూచించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు రాష్ట్రాలు దాటాల్సిన పరిస్థితులుంటే అందుకు వారిని అనుమతించాలని ఆదేశించారు. దేశంలోని చాలా చోట్లా ఈ క్లినిక్‌లు, ల్యాబ్‌లు తెరవలేని పరిస్థితులు ఏర్పడుతున్నట్టు సమాచారం అందుతున్నదని, కానీ, కొవిడ్ 19తో పోరాడుతున్న ఆస్పత్రులకు వీటి సేవలూ ముఖ్యమేనని వివరించారు. ఈ క్లినిక్‌లు, ల్యాబ్‌ల ద్వారా ఆస్పత్రులపైనే కాకుండా, దేశ ఆరోగ్య వ్యవస్థ పైనా భారం తగ్గుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed