ఇకపై పట్టణాల్లోనూ ఉపాధి హామీ?

by  |
ఇకపై పట్టణాల్లోనూ ఉపాధి హామీ?
X

దిశ, వరంగల్ సిటీ: కరోనాతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వలస కార్మికులు జీవనోపాధి లేక కుటుంబ పోషణ భారమై జీవితాన్ని కష్టాల సుడిగుండాల మధ్య వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అయితే సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు మేలు చేస్తామని ప్రకటించినా వాటికి మేలు కలిగిందనే అభిప్రాయం ఆయా వర్గాల్లో లేదు. అయితే కూలీలు, కార్మికులు అనేక మంది నేటికీ ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు వర్తింపజేయాలనే డిమాండ్ బలంగా వినబడుతోంది.

2019లోనే మధ్యప్రదేశ్‌లో..

అప్పటి వరకు గ్రామాల్లో అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కారు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేసింది. గ్రామ స్థాయిలో పూడికతీతలు, చెట్ల పెంపకం, కుంటల నిర్మాణాలు, కాల్వల నిర్మాణాలు, ఇంకుడు గుంతల వంటి పనుల ద్వారా ఉపాధి కల్పించారు. అదే విధంగా పట్టణ స్థాయిలోనూ ప్రభుత్వ భవన నిర్మాణాలు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య పనుల కల్పన ద్వారా ఉపాధి కల్పించారు. ఇందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉపాధి కల్పన పరిశోధనను ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాన్ని పట్టణ స్థాయిలో అమలు చేసింది.

నిధుల కేటాయింపు..

కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.2 లక్షల కోట్లు కేటాయించింది. ఉపాధి కల్పనకు రూ.36 వేల కోట్లను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఉపాధి కరువై స్వస్థలాలకు వెళ్లారు. ఫలితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగుల శాతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పట్టణ ఉపాధి పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉపాధి కల్పించాలా..? లేదా ప్రత్యామ్నాయ పథకాన్ని రూపకల్పన చేయాలని ప్రయత్నిస్తుంది.

రాష్ట్రాలకు నిధుల మళ్లీంపు!

కేంద్రం రాష్ట్రాలకు ఉపాధిహామీ పథకం అమలుకు ఏటా వేల కోట్ల రూపాయలను ఇస్తోంది. అయితే ఆ నిధుల్లో రాష్ట్రాలు సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 రోజులు కూడా ఉపాధి కల్పించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆయా నిధులను సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఉపాధి నిధులను ఆయా రాష్ట్రాలు ఖర్చు చేయకపోవడం, ఇతర పథకాల అమలుకు వినియోగిస్తుండడంతో కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధిస్తోంది. ఒకవేళ పట్టణ ఉపాధిహామీ అమలు చేస్తే మిగులు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించే వీలు ఉంటుంది. దానితో పాటు పట్టణాల్లో కొంత వరకు నిరుద్యోగాన్ని తగ్గించొచ్చు.

పట్టణాల్లో ఉపాధి కల్పించాలి

కరోనాకు ముందు పనుల కోసం హైదరాబాద్ వంటి నగరానికి వెళ్లా. ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో అమలు చేస్తున్న ఉపాధిహామీ పథకాన్ని పట్టణాల్లోనూ అమలు చేస్తే నిరుద్యోగులు, వలస కూలీలకు మేలు జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో మెప్మా స్వయం ఉపాధిని అందరికీ కల్పించలేకపోతోంది.

–కాంత్రి రణధీర్, నిరుద్యోగి

స్థానికులకు అవకాశం కల్పించాలి..

వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ వంటి పథకాల అమలులో స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. అదే విధంగా కుడా, బల్దియా నిర్మిస్తున్న రోడ్లు, హరితహారం వంటి పనుల్లో నగరవాసులను వినియోగించుకోవాలి. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. తద్వారా నిరుద్యోగాన్ని కొంతమేరకు తగ్గించినట్లు అవుతుంది.

–సాయి కుమార్, గ్రాడ్యూయేట్



Next Story