ఆ బ్యాంకులు కూడా ఆర్బీఐ పరిధిలోకే!

by  |
ఆ బ్యాంకులు కూడా ఆర్బీఐ పరిధిలోకే!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులనూ రిజర్వ్‌ బ్యాంక్‌ నియంత్రణలోకి తీసుకువస్తూ కేంద్ర కేబినెట్‌ ఆర్డనెన్స్‌ జారీ చేసింది. దీంతో సుమారు 1540 సహకార బ్యాంకులు ఆర్‌బీఐ కిందకు చేరనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ కేబినెట్‌ నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ సమయంలోనే కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ కిందకు తీసుకురానున్నట్టు తెలిపారు. తాజాగా ఆర్డినెన్స్ జారీతో 1482 పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంకులు, 58 రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్‌బీఐ పర్యవేక్షణ ఉండనుంది. దీనివల్ల 8.6 కోట్ల మంది డిపాజిట్‌దారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. షెడ్యూల్ బ్యాంకులపై ఉన్న అధికారాలే వీటిపైనా ఆర్‌బీఐకి ఉంటాయని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.

దీంతోపాటు, కేంద్రం రుణగ్రహీతలకు శుభవార్త తెలిపింది. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల్లో వడ్డీ రేట్ల రాయితీకి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే, శిశు విభాగం కింద రుణాలు తీసుకున్న వారికి వ‌డ్డీలో 2 శాతం రాయితీ ఇవ్వ‌నున్నామ‌ని పేర్కొన్నారు. అర్హ‌తలున్న ల‌బ్ధిదారుల‌కు 12 నెల‌లు రాయితీ ల‌భిస్తుంద‌న్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముద్ర యోజన కింద మూడు విభాగాల కింద రుణాలు పొందవచ్చు. వీటికి శిశు, కిషోర్, తరుణ్ అనే పేర్లను కేటాయించారు. శిశు విభాగం కింద రూ.50 వేల వరకు రుణాలను పొందవచ్చు. అలాగే, కిషోర్ విభాగం కింద రూ.5 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. తరుణ్ విభాగం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు.


Next Story

Most Viewed