వచ్చే నెల 15లోపు సీబీఎస్ఈ ఫలితాలు

by Shamantha N |
వచ్చే నెల 15లోపు సీబీఎస్ఈ ఫలితాలు
X

న్యూఢిల్లీ: వచ్చే నెల 15లోపు 10వ, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. పెండింగ్‌లో ఉన్న పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాతి రోజే సీబీఎస్ఈ తాజా ప్రకటన వెలువరించింది. రద్దు చేసిన పరీక్షల ఫలితాలకు అనుసరిస్తున్న ప్రణాళికపై సమగ్రవివరణను విడుదల చేసింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టు ఆమోదించింది. సుప్రీంకోర్టు ఆమోదించిన సీబీఎస్ఈ ప్రణాళిక ప్రకారం, అన్ని పరీక్షలు రాసిన 10వ, 12వ తరగతి విద్యార్థుల ఫలితాలు పరీక్షా పత్రాలను మూల్యాంకనం(వాల్యూయేషన్) చేసి ప్రకటించనుంది. మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన విద్యార్థుల విషయంలో, మెరుగైన ప్రదర్శన కనబరిచిన మూడు పరీక్షల ఫలితాల సగటునే మిగతా సబ్జెక్టుల ఫలితాలుగా ప్రకటిస్తుంది. మూడు పరీక్షలకే హాజరైతే ఎక్కువ మార్కులు వచ్చిన రెండు సబ్జెక్టుల ఫలితాల సగటును మిగతా సబ్జె్క్టులకు మార్కులుగా నిర్ధారిస్తుంది. అలాగే, ఒకటి లేదా రెండు సబ్జెక్టుల పరీక్షలు మాత్రమే రాసిన 12వ తరగతి విద్యార్థులు చాలా స్వల్పంగా ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఈ సంఖ్య ఎక్కువ ఉండే అవకాశముంది. వీరికి రాసిన పరీక్షల ఫలితాల తీరుతోపాటు ఇంటర్నల్/ప్రాక్టికల్/ప్రాజెక్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా రాయని పరీక్షల ఫలితాలను ప్రకటించనుందని సీబీఎసఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తున్నది. అయితే, ఈ ఫలితాలు వద్దనుకుని రిజల్ట్స్ ఇంప్రూవ్ చేసుకునేందుకు 12వ తరగతి విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించనున్నట్టు తెలిపింది. అప్పుడు ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులే తుది ఫలితాలుగా నమోదవుతాయని వివరించింది. అయితే, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఆ పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. అయితే, అన్ని పరీక్షలురాసిన విద్యార్థులతోపాటే ఇంకా కొన్ని సబ్జెక్టు ఎగ్జామ్స్ రాయని స్టూడెంట్‌ల ఫలితాలు జూలై 15లోపు విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ అసెస్‌మెంట్ ప్లాన్‌ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది.

Advertisement

Next Story

Most Viewed