ఎక్స్​అఫిషియోలు వద్దని హైకోర్టులో కేసు

by Shyam |
ఎక్స్​అఫిషియోలు వద్దని హైకోర్టులో కేసు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్లు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో ఓట్లేసి కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలిపిస్తారు. వారే చైర్మన్/మేయర్​ ను ఎన్నుకోవడం ధర్మం. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా ఎక్స్​అఫిషియో సభ్యులుగా చేరి ప్రజా తీర్పును మార్చేస్తున్నారు. అందుకే ఈ ఎక్స్​అఫిషియో విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు దాఖలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అంశాలు, ఎంపీ ఎన్నికల్లో జాతీయాంశాలతో ఓట్లేస్తారు. అదే పురపాలక సంస్థల్లో స్థానిక అంశాల ప్రాతిపదికనే గెలుపోటములు ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మేయర్/చైర్మన్​ ఎన్నికలో ప్రజాప్రతినిధుల హక్కు సరైంది కాదని పిటిషనర్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరావత్​ అనిల్​కుమార్​ వాదించారు. గురువారం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఇవే అంశాలను ప్రస్తావించారు.

కనీసం ఆ ప్రాంతానికి సంబంధం లేకపోయినా ఎక్స్​అఫిషియో సభ్యుడిగా చేరి ఓటర్ల తీర్పుకు భిన్నంగా మేయర్ ను ఎన్నుకుంటున్నారు. ఈ పద్ధతి అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచి రెండేండ్లు అయ్యింది. ఈ క్రమంలో వారంతా కలిసి మరో ఐదేండ్ల పాటు మేయర్ గా ఉండే ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. పైగా రెండేండ్ల నాటి రాజకీయ పరిస్థితులే ఇప్పుడు లేవు. ఈ క్రమంలో ప్రజల తీర్పు ఆ ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ల ప్రత్యేకమైన అధికారాన్ని ఉపయోగించుకొని అనుకూల వాతావరణాన్ని సృష్టించడం విడ్డూరంగా ఉందని పిటిషనర్ అన్నారు.

ప్రజలు ఒక పార్టీకి మెజారిటీ ఇచ్చినా మేయర్, చైర్మన్ అయ్యేందుకు ఎక్స్​అఫిషియో సభ్యులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేండ్లు మాత్రమే పదవీ కాలంలో ఉండే ప్రజాప్రతినిధులు కలిసి ఐదేండ్లు ఉండే మేయర్/చైర్మన్​ ను ఎన్నుకోవడం సమంజసం కాదన్నారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నాల్గో తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed