దొంగలతోపాటు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు

by  |
దొంగలతోపాటు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇంట్లో దొంగతనం జరిగిందా.. అయితే ఇక నుండి మీ ఇంట్లో ఏమేం చోరికి గురయ్యాయో అవి మాత్రమో పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇక ముందు తప్పుడు ఫిర్యాదు చేశారో దొంగలతో పాటు మీరూ నిందితులుగా మారుతారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పెద్దపల్లి పోలీసులు. డీసీపీ రవిందర్ అందించిన వివరాల ప్రకారం… జిల్లాలోని సుల్తనాబాద్ గుడిమహాల్ కు చెందిన కుడిది వనిత ఈ నెల 22న తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగంతకులు ఏడు తులాల బంగారం, రూ. లక్ష నగదు, రెండు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో సుల్తానాబాద్ సీఐ, మహేందర్ రెడ్డి, ఎస్సై ఉపేందర్ ఆధ్వర్యంలో దొంగల కోసం ఆరా తీసి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. నిందితులిద్దరూ వనిత ఇంట్లో నుండి రూ. 20 వేల విలువగల సెల్ ఫోన్లు మాత్రమే దొంగలించామని ఒప్పుకున్నారు. నిందితులను అన్ని రకాలుగా విచారించినా వారు చోరీకి పాల్పడింది రెండు సెలుఫోన్లేనని చెప్తుండడంతో పోలీసులకు అంతుచిక్కకుండా పోయింది. చివరకు కంప్లైంట్ చేసిన వనితను పూర్తి వివరాలు అడగగా రెండు సెల్ ఫోన్లు మాత్రమే పోయాయని తానే తప్పుడు ఫిర్యాదు చేశానని ఒప్పుకుంది.

ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు పోయిందని ఫిర్యాదు చేస్తే రికవరీ సమయంలో లాభం జరుగుతుందన్న దురుద్దేశంతోనే తప్పుడు ఫిర్యాదు చేశానని పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇంటి నిర్మాణ అవసరాల నిమిత్తం ఏడు తులాల బంగారు ఆభరణాలను గ్రామీణ బ్యాంక్ లో తనఖా పెట్టి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఇంటి నిర్మాణ పనుల కోసం ఒకరికి 50 వేల రూపాయలు ఇచ్చింది. కానీ, తన ఇంట్లో ఎలాగు చోరీ జరిగింది కాబట్టి తప్పుడు ఫిర్యాదు చేస్తే ఎక్కువ రికవరీ అవుతుందని భావించింది. చివరకు పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీసి వనిత దురుద్దేశంతోనే కట్టుకథ చెప్పి తప్పుదోవ పట్టించిందని గుర్తించారు. తమ సమయాన్ని వృధా చేసినందున వనితపై కేసు నమోదు చేశామని డీసీపీ రవిందర్ తెలిపారు. అలాగే దొంగనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.


Next Story

Most Viewed