కరోనా లెక్కలపై క్లారిటీ మిస్సింగ్..!

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ఉత్తమంగా ఉందని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంది. మరణాల విషయంలో జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, ఒక శాతం కూడా లేదని చెప్తోంది. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పడుతుందని అంటోంది. కానీ, హైకోర్టు మాత్రం కరోనా లెక్కలపై అనుమానం ఉందని, తప్పుడు లెక్కలు చెప్తే ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిజంగా సర్కారు వెల్లడిస్తున్న కరోనా లెక్కలు నిజమేనా? జిల్లాల బులెటిన్‌లకు రాష్ట్ర బులెటిన్‌కు తేడా ఎందుకుంటోంది? జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన 7,683 యాంటీజెన్ టెస్టుల్లో 707 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, బులెటిన్‌లో మాత్రం కేవలం 304 అని మాత్రమే సర్కారు ఎందుకు చెప్పినట్లు? రోజుకు 8-10 మంది మాత్రమే చనిపోతున్నారా అని హైకోర్టు కూడా ప్రశ్నించిందంటే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కేసుల్ని, డెడ్‌బాడీలను దాచడం సాధ్యమేనా అని ప్రశ్నించిన మంత్రులు ఇప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది.

మాస్కు ధరిస్తేనే ఎంట్రీ..

కరోనా మన దేశంలో పుట్టిన జబ్బే కాదు..మాస్కులెందుకు..ఇక్కడ ఎవరైనా మాస్కులు పెట్టుకున్నరా.. పారాసిటమాల్ వేస్తే ఖతమైతది..అవసరమైతే వెయ్యి కోట్లైనా ఖర్చుపెడతాం..ఎమ్మెల్యేలు మాస్కులే పెట్టుకోకుండ పనిచేస్తరు…అని అసెంబ్లీ వేదికగా మార్చి నెలలో వినిపించిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ, ఇదే సభలో ఇప్పుడు మాస్కులు తప్పనిసరి. మాస్కు లేకుంటే ఎంట్రీ కూడా లేదు. ప్రతీ ఒక్కరూ కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించి లోపలికి వెళ్లాలన్న నిబంధన అమలవుతోంది. ఏప్రిల్ 28 తర్వాత కరోనా ఉండదు..మే నెల మొదటి వారంకల్లా రాష్ట్రం కరోనారహితమవుతుంది.. అని అన్నారు. కానీ, ఇప్పుడు సెప్టెంబరు రెండో వారం రానే వచ్చింది. అధికారుల లెక్క ప్రకారం జీహెచ్ఎంసీలో ఈ పాటికే కరోనా ఖతం కావాల్సి ఉంది. ఈ నెల చివరికల్లా రాష్ట్రంలో మటుమాయం కావాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి డెడ్‌లైన్ ఇప్పుడు సెప్టెంబరు దాకా వచ్చింది. ఇంకా ఎన్ని డెడ్‌లైన్‌లు వినాల్సి ఉంటుందో! పారాసిటమాల్‌తో ఖతం కావాల్సిన కరోనాకు ఇప్పుడు ప్లాస్మా చికిత్స అవసరమవుతోంది.

నియంత్రణ కరువు..

కరోనా పరీక్ష మొదలు చికిత్స వరకు కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులకు సర్కారు ధరలను నిర్ణయించింది. కానీ, ఒక్క ఆస్పత్రిలో కూడా అవి అమలు కావడంలేదు. స్వయంగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే ఫిర్యాదులు వేల సంఖ్యలో వచ్చాయని పేర్కొన్నారు. కేవలం రెండు ఆస్పత్రులపై మాత్రమే చర్య తీసుకున్న ప్రభుత్వం మిగిలినవాటిపై చర్యలు తీసుకోడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. విచారణ పేరుతో వారాలు, నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. ఇదే విషయాన్ని హైకోర్టు గత వారం విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సగం బెడ్ల స్వాధీనమెప్పుడో..?

సగం బెడ్‌లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలన్ననిబంధనకు యాజమాన్యం నుంచి సానుకూల స్పందన వచ్చి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ బెడ్‌లు స్వాధీనం కాలేదు. పేషెంట్ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆధారాలతో సహా బాధితుల నుంచి సర్కారుకు ఫిర్యాదులు అందినా చర్యలు లేవు. ఎపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలే తప్ప, దానికి తగిన ఆచరణ లేదు. రోజూ ఎన్ని కరోనా టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వ డాష్‌బోర్డుకు తెలియజేయాలని సర్క్యులర్ జారీ చేసినా అమలు అటకెక్కింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, తదనుగుణమైన చర్యలు తీసుకోలేకపోయారు.

ప్రజారోగ్యంపై పట్టింపేది?

విద్య, వైద్య రంగాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరేండ్లలో వైద్య విధాన పరిషత్‌లో, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఒక్క పోస్టు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ కాలేదు. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు వైద్య విధాన పరిషత్‌లో ఏ పోస్టు కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ కాలేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలనుకున్న ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉందని కమిషనర్ ఒక ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారు.

ఖాళీల భర్తీ ఎప్పుడో?

వైద్య విధాన పరిషత్ విభాగం కింద ఉన్న ఆస్పత్రుల్లో 2,271 స్టాఫ్ నర్సులు పోస్టుల్ని సర్కారు మంజూరు చేస్తే 1,113 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 1,158 ఖాళీగానే ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో 1,116 నర్సుల పోస్టుల్లో 213 ఖాళీగా ఉన్నాయి. ఇక వైద్య విద్య విభాగంలో 3,604 పోస్టుల్లో 1,703 ఖాళీగా ఉన్నాయి. నర్సు పోస్టుల విషయం ఇలా ఉంటే ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది పోస్టుల విషయంలోనూ ఇలాంటి కొరత తీవ్రంగానే ఉంది. రాష్ట్ర ప్ఱభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 9,270 నర్సు పోస్టులుంటే కేవలం 4,373 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీనికంటే ఎక్కువగా (4,897) ఖాళీగా ఉన్నాయి. టీఎస్ఎంఎస్ఐడీసీలో 130 పోస్టులకుగాను ఇంకా 37 ఖాళీగానే ఉన్నాయి.

తక్కువ లెక్కలు కట్టడికి తార్కాణం కాదు : శ్రీనివాస్, CPIM జిల్లా కార్యదర్శి

ప్రభుత్వం చెప్తున్న లెక్కలను చూసి కరోనా కట్టడి అయిందనుకుంటే పొరపాటు. తప్పుడు గణాంకాలు ఇచ్చి చాలా రాష్ట్రాల కంటే భేషుగ్గా కొవిడ్‌ను నియంత్రించామనే గొప్పలు చెప్పుకోవడం సర్కారు ఉద్దేశం. జిల్లాల్లో నమోదవుతున్న కేసులను, బులెటిన్‌లో కనిపించే లెక్కలను చూస్తే రెండొంతులు తగ్గించి ఒక వంతు మాత్రమే చూపిస్తుందనేది అర్థమవుతోంది. జూలై మొదటివారం వరకు లెక్కల్లో తేడా తక్కువ ఉన్నప్పటికీ యాంటీజెన్ టెస్టులు మొదలుపెట్టిన తర్వాత మాత్రం బాగా పెరిగింది. వాస్తవ స్థితికి లెక్కలు నిదర్శనం ఎంతమాత్రం కాదు. ఇప్పటికీ ప్రైవేటు ల్యాబ్‌లలో జరుగుతున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లో దాదాపు 30% పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. కానీ, ఈ గణాంకాలు బయటకు రావడం లేదు.

Advertisement