నీళ్లొస్తున్నా.. ఎత్తిపోస్తలేరు.. ఎందుకని..?

by  |
నీళ్లొస్తున్నా.. ఎత్తిపోస్తలేరు.. ఎందుకని..?
X

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలి. అలా ఎత్తిపోసిన నీటిని లిఫ్టుల ద్వారా మేడారం, మిడ్ మానేరుకు తరలించాలి. అయితే ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయడం లేదు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఉన్న నీటినే తరలిస్తున్నారు. కాగా, ఎస్సారెస్పీకి ఇప్పటికే 40 టీఎంసీల వరద నీరు రావడంతో ఎల్లంపల్లికి విడుదల చేసే చాన్స్ ఉంది.

దిశ ప్రతినిధి, కరీంనగర్: మేడిగడ్డకు ప్రాణహిత నుంచి భారీ వరద వస్తున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదన్న ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. మోటార్లు పనిచేస్తలేవా? లేక ఖర్చు తగ్గించుకునేందుకా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు రూ.7 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకే ఎత్తిపోయట్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గతేడాది 150 టీఎంసీలు దిగువకు..

కాళేశ్వరం ఫలాలను అందిపుచ్చుకున్న తరుణంలో గతేడాది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో దాదాపు 150 టీఎంసీల నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. అప్పటికే అధికారులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించారు. అయితే ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున ఎల్లంపల్లికి వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టుకు ఎత్తిపోసిన నీటిని తిరిగి దిగువకు వదలాల్సి వచ్చింది. దీంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని ఎత్తి పోసి వృథాగా కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చిందని అధికారులు గుర్తించారు.

కరెంట్ బిల్లు తగ్గించేందుకే..!

ఒక్కో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు అన్ని పంప్ హౌజ్‌ల విద్యుత్ కోసం సగటున రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు వెచ్చించాల్సి వచ్చిందని అధికారులు అంచనా వేశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈసారి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయవద్దనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లంపల్లికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని మొదటగా నందిమేడారం, గాయత్రి పంప్‌హౌజ్‌ల మీదుగా తరలించాలని నిర్ణయించారు. ఎల్లంపల్లికి ఎగువ ప్రాంతమైన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు ఆగస్టు నెలాఖరు వరకు వరద నీరు వస్తుందని 60 నుంచి 70 టీఎంసీల వరకు నీరు ఈ ప్రాజెక్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 7 టీఎంసీల సామర్థ్యం ఉన్న కడెం ప్రాజెక్టుకు 5.5 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలే అవకాశాలు ఉన్నాయి.

ఎస్సారెస్పీకి చేరిన 40 టీఎంసీలు..

అలాగే బాబ్లీ గేట్లను ఎత్తినందున ఎస్సారెస్పీలోకి 40 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టలోకి కూడా సమృద్ధిగా నీరు రానుందని దీంతో గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుందని ఇంజినీర్లు అంచనా వేశారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరగానే అక్కడి నుంచి నందిమేడారం, గాయత్రీ పంప్‌హౌజ్‌ల ద్వారా మిడ్‌మానేరు, ఎల్ఎండీలతో పాటు కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్‌లకు తరలించనున్నారు. గత సీజన్‌లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని అంచనా వేయకపోవడంతో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీరు, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు అంతా కలిపి 150 టీఎంసీల వరకు తిరిగి దిగువ ప్రాంతానికే వదలాల్సి వచ్చింది.

మేడిగడ్డకు చేరుతున్న లక్షల క్యూసెక్కుల వరద నీరు..

మేడిగడ్డ బ్యారేజ్‌కి ప్రాణహిత నుంచి రోజుకు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి రానున్న రోజుల్లో గోదావరి వరద కూడా జత అయితే ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) నీరు నిలువ ఉంచనున్నారు. అయితే ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు అక్టోబర్ నెలాఖరు వరకు కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో గోదావరిలో వరద నిలిచిపోయినా ప్రాణహిత నుంచి అక్టోబర్ వరకు వరద నీరు వచ్చిన విషయాన్ని గమనించడంతో ఆగస్టు నెల వరకు ఎల్లంపల్లికి వచ్చే వరద నీటిని ఎగువ ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు చేసుకున్నారు. ఎల్లంపల్లికి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గిన తరువాత మేడిగడ్డ వద్ద నిలువ ఉంచిన నీటిని ఎల్లంపల్లికి తరలిస్తారు. ఈ విధానంలో వల్ల వందల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుందని భావిస్తున్నారు.


Next Story