ఈ-కామర్స్ ముసాయిదా నిబంధనలు నీరుగార్చొద్దు : సీఏఐటీ!

by Harish |
CAIT
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పెట్టుబడులున్న ఆన్‌లైన్ సంస్థల ఒత్తిడితో ఈ-కామర్స్ నిబంధనల ముసాయిదాను నీరుగార్చవద్దని దేశీయ వ్యాపారుల సంఘం సీఏఐటీ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఏఐటీ లేఖ రాసింది. ఈ-కామర్స్ నిబంధనల ముసాయిదా కఠినంగా ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్ కంపెనీల ఒత్తిడి తెచ్చే వ్యూహాలను అనుసరించవచ్చని, అలాంటి పరిస్థితుల్లో ముసాయిదా పలుచన కాకుండా చూసుకోవాలని సీఏఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిబంధనల్లో ఎలాంటి మార్పులు వద్దని, సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఆ నియమాలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొంది. విదేశీ పెట్టుబడుల ఈ-కామర్స్ కంపెనీలు వ్యాపార విధానాలను ఉల్లంఘించడం వల్ల దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో దుకాణాలు మూసివేయాల్సి వచ్చిందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది.

భారత వ్యాపారులు ఈ-కామర్స్‌కు వ్యతిరేకం కాదు. అయితే, ఈ-కామర్స్ భవిష్యత్తులో అత్యంత ఆశాజనకమైన వ్యాపార మార్గమని భావిస్తున్నాం. వస్తువుల అమ్మకాల్లో అవకతవకలు, ఫ్లాష్‌సేల్స్ ఖచ్చితంగా నిషేధించబడతాయి. కాబట్టి ప్రతి ఈ-కామర్స్ సంస్థ చట్టానికి లోబడి నిర్దిష్ట వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నియమాలను పాటించాలని’ నాంగియా ఆండర్సన్ ఎల్ఎల్‌పీ పార్టనర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. కొత్త ముసాయిదా ప్రకారం.. ఈ-కామర్స్ కంపెనీలు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌తో పాటు చట్టబద్ధమైన ఏజెన్సీలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాల్సి ఉంది.

Advertisement

Next Story