క్యాడ్‌బరీ ప్రొడక్ట్స్‌లో గొడ్డు మాంసం.. నిజమా?

by Shyam |   ( Updated:2021-07-19 03:51:32.0  )
క్యాడ్‌బరీ ప్రొడక్ట్స్‌లో గొడ్డు మాంసం.. నిజమా?
X

దిశ, ఫీచర్స్ : వయసుతో సంబంధం లేకుండా చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు. డిలీషియస్ టేస్ట్‌తో కట్టిపడేసే అనేక రకాల ఫ్లేవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. వాటిల్లో క్యాడ్‌బరీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇండియా వ్యాప్తంగా కొందరు నెటిజన్లు ఆ కంపెనీకి చెందిన కొన్ని ఉత్పత్తుల్లో జెలటిన్‌ను వాడుతున్నారని ఆరోపిస్తూ సదరు ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. జెలటిన్ ఉందంటే అందులో గొడ్డు మాంసాన్ని వాడినట్టేనని తెలిపే స్ర్కీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది నిజమా? అంటూ @CadburyUKను ట్విట్టర్‌లో ప్రశ్నించిన ఒక యూజర్.. నిజమైతే, హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను హిందువులచే బలవంతంగా తినిపించినందుకు క్యాడ్‌బరీపై కేసు పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘మా పూర్వీకులు, గురువులు తమ ప్రాణాలను త్యాగం చేశారే తప్ప, గొడ్డు మాంసం తినలేదు. కానీ స్వాతంత్ర్యం తర్వాత పాలకుల విధానంతో మా ధర్మం ఉల్లంఘించబడింది’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్రిటిష్ కంపెనీని బ్యాన్ చేయాలంటూ వందలాది ట్వీట్లు వైరల్‌‌గా మారాయి. కాగా ఈ ఇష్యూపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ క్లారిటీనిస్తూ ప్రకటన చేసింది. ఇండియాలో విక్రయించిన, తయారు చేయబడిన మొండేలెజ్/క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని తెలిపింది. అంతేకాదు చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క ఇదే విషయాన్ని సూచిస్తుందని వెల్లడించింది.

తమ బ్రాండ్‌కు చెడ్డపేరు తీసుకొచ్చే ఇలాంటి నెగెటివ్ పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని మరొక ట్వీట్‌లో యూజర్లను కోరింది. ఎందుకంటే తమ ఉత్పత్తులపై వినియోగదారులకు ఉన్న విశ్వాసం.. ఫేక్ న్యూస్ వల్ల కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కాగా ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు చెందిన స్ర్కీన్ షాట్ ఇండియాలో వైరల్ అయిందని చాలా మంది యూజర్లు గుర్తించారు. నిజంగానే ఇండియాలోని క్యాడ్‌బరీ బ్రాండ్ ఉత్పత్తులపై వెజిటేరియన్‌కు గుర్తుగా గ్రీన్ కలర్ మార్క్ ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed