కొత్త సచివాలయానికి మంత్రివర్గం ఆమోదం

by Anukaran |   ( Updated:2020-08-05 12:12:42.0  )
కొత్త సచివాలయానికి మంత్రివర్గం ఆమోదం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర నూతన సచివాలయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడు అంతస్తుల్లో ఒకే భవనంగా రూపొందించిన డిజైన్‌కు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. తూర్పు దిక్కుగా భవనానికి ప్రవేశం ఉండేలా చెన్నయ్ నగరానికి చెందిన ఆస్కార్, పొన్న ఆర్కిటెక్ట్ దంపతులు, సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్ సంస్థకు చెందిన ఇంజనీర్లు రూపొందించిన ఐదవ డిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 600 అడుగుల వెడల్పుతో, 300 అడుగుల అడ్డంగా ఉండే ఒకే భవనానికి కిటికీలకు వాడే అద్దాలన్నీ నీలి రంగులో ఉండేలా డిజైన్ ఖరారైంది. ధోల్‌పూర్‌లో ఉండే లేత గోధుమ రంగు రాళ్ళతో భవనాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన సచివాలయ నమూనాలో అధికారులు పేర్కొన్నారు.

సచివాలయం డిజైన్ ఖరారైనందున ఇకపైన టెండర్లను ఆహ్వానించి ఖరారుచేసి నిర్మాణ పనులను మొదలుపెట్టడమే తరువాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రూ. 250 కోట్ల మేర ఖర్చు కానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత అది రూ. 450 కోట్ల వరకూ ఖర్చు కావచ్చని రోడ్లు భవనాల శాఖ అధికారులు నోటిమాటగా తెలిపారు. ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు కూడా దాటే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయం పనులు ప్రారంభం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పాత సచివాలయంలోని రెండు భవనాల కూల్చివేత పనులు ఇంకా పూర్తికాలేదు. కానీ ఇప్పటికే కూల్చివేసిన భవనాల నుంచి వెలువడిన శిధిలాల తొలగింపు మాత్రం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇక నేలను చదును చేసి పనులు మొదలుపెట్టడమే మిగిలిందని రోడ్లు భవనాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాంట్రాక్టు సంస్థను ఫైనల్ చేసిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Next Story