బండి కదలక.. పూట గడవక

by Shyam |
బండి కదలక.. పూట గడవక
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్​ ప్రపంచాన్నే వణికించింది. అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతిసింది. లాక్​డౌన్​ అనేక మందికి ఉపాధిని దూరం చేసింది. హైదరాబాద్ నగరంలోని మ్యాక్సీ క్యాబ్​లు (7ప్లస్1 సీట్లు), బస్సులు(కాంట్రాక్టు క్యారియర్లు‌) నడిపే వారి జీవనాన్ని ఆగమాగం చేసింది. నేటికీ వారు కోలుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో వారంతా తమ వాహనాలకు ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వానికి చెల్లించే క్వార్టర్లీ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో మిగిలి ఉన్న రెండు త్రైమాసికాలైన జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లకు క్వార్టర్లీ పన్ను మొత్తానికే రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

జర్ని లేక..నారాజ్​

హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సమారు 5 లక్షల మంది ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా కరోనా భయంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంపెనీల ఉద్యోగులను ఆఫీసులకు తీసుకెళ్లే ట్రాన్స్‌పోర్ట్ వెండార్లు ఐటీ కంపెనీలతో అగ్రిమెంట్లు రెన్యువల్ కాక.., ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పాత పేమెంట్లు రాక కొత్త కాంట్రాక్టులు కుదరక నగరంలోని మ్యాక్సీ క్యాబు, మినీ బస్సుల ఓనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో క్వార్టర్లీ పన్ను చెల్లించే గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు కలిపి మొత్తం 7 లక్షల దాకా ఉంటాయని రవాణా శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటిలో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే లారీలు, వ్యాన్లు, ఎల్ సీవీలు, ఇతర సరుకుల రవాణా వాహనాలకు లాక్‌డౌన్ తర్వాత కొంత వరకు ఊరట కలిగినప్పటికీ.. ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలకు మాత్రం ఉపశమనం లభించడం లేదు. పెళ్లిళ్లు, జాతరలు, ఇతరత్ర శుభకార్యాలు ఏవీ లేకపోవడంతో వారందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే డీజిల్, పెట్రోలు రేట్లు గణనీయంగా పెరగడంతో తమ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఉందన్నారు.

ప్రభుత్వ ఖజానా ఖాళీ

ప్రభుత్వం ఖజానాలో డబ్బులేకపోవడంతో.. పన్నులు పెంచే పరిస్థితే కానీ పన్నులు తగ్గించే స్థితిలో లేదని తెలుస్తోంది. నిజానికి బడ్జెట్‌లో రవాణా శాఖ వేసుకున్న రూ.3400 కోట్ల ఆదాయ అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది రోడ్డు ట్యాక్స్ పన్ను పెంచి వసూలు చేయాలని ప్రభుత్వం లెక్కలు వేసుకున్నదని స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న పన్నునే రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుండడంతో రవాణా శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత త్రైమాసికానికి రూ.100 కోట్లకు పైగా రావాల్సి ఉంటే కేవలం రూ. 69.64 కోట్లు మాత్రమే ట్యాక్స్ రూపంలో వసూలయ్యాయని అధికారులు చెబుతున్నారు.

పన్నులు ఇలా..

మ్యాక్సీ క్యాబ్​కు(7ప్లస్ 1 సీటింగ్ కెపాసిటీ) క్వార్టర్లీ పన్ను రూ. 4600 ఉండగా, బస్సులో ఒక సీటుకు మూడు నెలలకు 892 రూపాయలుగా ఉందని, వీటి వసూలు రద్దుకు నిర్ణయం తీసుకుంటే భారీ మొత్తంలో పన్నును ప్రభుత్వం నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రంలోని ఆటోలు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్డు పన్నును మినహాయించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు రాక స్వయం ఉపాధి కోసం క్యాబ్​లు, బస్సులు కొనుక్కొని జీవితం గడుపుతున్నామని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఆదుకోవాలని రాష్ట్ర ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ సలావుద్దీన్ కోరుతున్నారు.

Advertisement

Next Story