కొత్త ఫోన్ ఏప్రిల్ 1 ముందే తీసుకోవాలా?

by Sujitha Rachapalli |   ( Updated:2020-03-21 08:52:24.0  )
కొత్త ఫోన్ ఏప్రిల్ 1 ముందే తీసుకోవాలా?
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో రోజుకో కొత్త మొబైల్ వస్తూనే ఉంది. మోడల్, ఫీచర్స్‌ను బట్టి ఫోన్ ధరలు మారుతుంటాయి. కానీ, ఫైనాన్సిలియర్ చేంజ్ అయితే కూడా ఫోన్ ధరల్లో మార్పులు వస్తాయి. ఎలా? ఏంటో? తెలుసుకుందాం.

చాలామంది ఏ మొబైల్ కొనాలి? మార్కెట్లో ఏ మోడల్బాగుంది. ఏయే కంపెనీలు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ అందిస్తున్నాయి.. కలర్ వేరియంట్స్ ఎన్ని ఉన్నాయి. ప్రాసెసర్ ఎంత ఉంది? స్టోరేజ్ బాగుందా? కెమెరా పనితీరు ఎలా ఉంది.. అన్న లెక్కలు మాత్రమే బేరీజు వేసుకుంటారు. దాంతో పాటు.. ఆన్లైన్ లోనో , షాపుల్లోనూ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు పెడితే.. ఆ సమయంలో తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం మరో అంశాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే.. మార్చి 31 లోపే కొనడం ఉత్తమం. ఎందుకంటే… ఆ తర్వాత రేట్లు పెరిగే అవకాశముంది.

పెరుగుతున్న జీఎస్టీ

ఇటీవల 39వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జీఎస్‌టీ పెంచడంతో సెల్‌ఫోన్ కంపెనీలకు భారంగా మారింది. కంపెనీలన్నీ కూడా ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఒకటి వాటి లాభాలను తగ్గించుకొని జీఎస్‌టీ సర్దుబాటు చేయడం. లేదంటే, స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచి ఆ భారాన్ని కస్టమర్లపై మోపడం. కనీసం రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లను అయినా జీఎస్‌టీ కౌన్సిల్ మినహాయించాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను షావోమీ ఇండియా ఎండీ మనూ జైన్ కోరారు. స్మార్ట్‌ఫోన్లు, వాటిలో ఉపయోగించే విడిభాగాలపై ఏప్రిల్ 1 నుంచి 18 శాతం జీఎస్‌టీ అమలులోకి రానుంది. అంటే ఒక స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా 6 శాతం భారం పడనుంది. ఆ భారం నేరుగా కస్టమర్‌పైనే పడే అవకాశం ఉంది. అంటే మీరు రూ.15,000 ఫోన్ కొనాలంటే అదనంగా 6 శాతం అంటే రూ.900 చెల్లించాల్సి రావచ్చు. దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags : cell phone, financial year, gst, budget, mobile phone, model, features

Advertisement

Next Story