- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Zomato: కంపెనీ పేరు, లోగో మార్చిన జొమాటో

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన పేరుతో పాటు లోగోను కూడా మార్చుకుంది. ఈ మేరకు పేరును 'ఎటర్నల్ లిమిటెడ్'గా మార్చినట్లు కంపెనీ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రీబ్రాండింగ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫుడ్ డెలివరీ సేవలకే పరిమితం కాకుండా కంపెనీ విస్తృత వ్యాపార పరిధిని ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడింది. అంటే జొమాటోనూ కొనసాగిస్తూనే అన్ని వ్యాపారాలను ఎటర్నల్ పరిధిలోకి తీసుకొస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్ల నుంచే కంపెనీ తన అంతర్గత కార్యకలాపాల్లో ఈ పేరును వాడుతున్నప్పటికీ, అధికారికంగా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ కంపెనీ లోగోను ఆవిష్కరించారు. 'కంపెనీ క్విక్ కామర్స్ స్టార్టప్ బ్లింక్ఇట్‌ను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ బ్రాండ్, యాప్ మధ్య తేడాను గుర్తించేందుకు అంతర్గతంగా 'ఎటర్నల్ ను ఉపయోగించడం మొదలుపెట్టాం. జొమాటో కంటే మించిన భవిష్యత్తు వ్యాపార సంస్థగా ఎదిగిన తర్వాత ఎటర్నల్ పేరును పబ్లిక్‌గా మార్చాలని అనుకున్నామని' దీపిందర్ వివరించారు. ఇక నుంచి జొమాటో లిమిటెడ్‌గా ఉన్న సంస్థ పేరు ఎటర్నల్ లిమిటెడ్‌గా ఉంటుందన్నారు. అయితే, జొమాటో బ్రాండ్, యాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. పేరుతో పాటు కంపెనీ లోగో మార్పునకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఇకపై స్టాక్ టిక్కర్ కూడా జొమాటో నుంచి ఎటర్నల్‌గా మారనున్నట్టు దీపిందర్ చెప్పారు. పేరు మార్పు ద్వారా ఎటర్నల్ పరిధిలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, క్విక్ కామర్స్ విభాగంలో బ్లింక్ఇట్, రెస్టారెంట్‌ల కోసం బీ2బీ సరఫరా సేవలందించే డిస్ట్రిక్ట్, లాజిస్టిక్స్ కార్యకలాపాలకు ఉద్దేశించిన హైపర్ ప్యూర్‌లతో నాలుగు కీలక వ్యాపారాలు ఉంటాయని పేర్కొన్నారు.