మూడు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |
మూడు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో మూడు నెలల కనిష్ట స్థాయి 0.27 శాతానికి తగ్గింది. అంతకుముందు 2023, డిసెంబర్ నెలలో ఇది 0.73 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. బుధవారం వెల్లడిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత నెలలో టోకు ఆహార ద్రవ్యోల్బణం 3.79 శాతానికి తగ్గింది. గతేడాది డిసెంబర్‌లో 5.39 శాతం కంటే తగ్గింది. జనవరి నెల టోకు ద్రవ్యోల్బణంలో అత్యధికంగా తయారీ ఉత్పత్తులు 1.13 శాతం క్షీణించగా, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 0.51 శాతం ప్రతికూలంగా నమోదయ్యాయి. ఖనిజాలు, ముడి పెట్రోలియం వంటి ప్రాథమిక వస్తువుల ధరలు 3.84 శాతంతో సానుకూలంగా కొనసాగాయి. ఆహార పదార్థాలు, యంత్రాలు-పరికరాలు, తయారీ, ఖనిజాలు, ఇతర రవాణా పరికరాలు ధరలు పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి. ఇటీవలే దేశీయంగా జనవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మూడు నెలల కనిష్టం 5.1 శాతానికి దిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story