పరుగులు పెడుతున్న పసిడి.. ఈ ఏడాది చివరి నాటికి రూ.1.25 లక్షలు!

by D.Reddy |
పరుగులు పెడుతున్న పసిడి.. ఈ ఏడాది చివరి నాటికి రూ.1.25 లక్షలు!
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం (Gold).. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు (Gold prices) భారీగా పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల్లో తగ్గుదల కనిపించినప్పటికీ అది స్వల్పంగానే ఉండటంతో సామాన్యుడికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రూ.లక్షకు అటు, ఇటు ఊగిసలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ 22న ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలను దాటేసి ఆల్ టైం రికార్డును (All time record) నమోదు చేసింది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలు మరింత షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర రూ.1.25 లక్షలు దాటే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. అందుకు పలు కారణాలనుక కూడా వెల్లడించారు.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు.. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ క్షీణత, ఆర్థిక మాంద్యం భయాలు వంటి కారణాలతో మదుపరులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి తీవ్రమైతే ఈ ఏడాది చివరి నాటి బంగారం ఔన్స్ ధర 4500 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 25 శాతం పుంజుకోగా, దేశీయంగా తులం రూ.20 వేలదాకా ఎగిసింది.

అంతేకాదు, 2030 నాటికి, ఆర్థిక అనిశ్చితులు, డిమాండ్-సరఫరా ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం కారణంగా ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పుత్తడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నామని తెలిపారు. ఇక ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం, హాల్‌మార్క్ బంగారం ఎంచుకోవడం, దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించడం మంచిదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.



Next Story

Most Viewed