Ratan Tata: రతన్ టాటా రూ. 10,000 కోట్ల వీలునామాలో శంతను నాయుడుకు వాటా

by S Gopi |
Ratan Tata: రతన్ టాటా రూ. 10,000 కోట్ల వీలునామాలో శంతను నాయుడుకు వాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం అందరినీ బాధించింది. అదే సమయంలో ఆయన చివరి దశలో అత్యంత సన్నిహితంగా ఉన్న శంతను నాయుడు గురించి కూడా అందరూ చర్చించుకున్నారు. టాటా ట్రస్ట్‌లో పిన్న వయసు జనరల్ మేనేజర్‌గానే కాకుండా రతన్ టాటాకు విశ్వసనీయమైన అసిస్టెంట్‌గా శంతను మరోసారి వార్తల్లో నిలిచారు. రతన్ టాటాకు చెందిన రూ. 10,000 కోట్ల వీలునామాలో శంతను నాయుడు పేరు ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ఎంతమేర వాటా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా శంతను నాయుడుకు చెందిన సహచర వెంచర్ గుడ్‌ఫెలోస్‌లో కూడా రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. తన వీలునామాలో గుడ్‌ఫెలోస్‌లో ఉన్న తన వాటాను రతన్ టాటా వదులుకున్నట్టు సమాచారం. అలాగే, విదేశాలలో చదువుకోవడానికి నాయుడు తీసుకున్న రుణాన్ని మాఫీ చేశారు.

అతనితో పాటు రతన్ టాటా తన తోబుట్టువులు, వ్యక్తిగత సహాయకుడు, పెంపుడు జంతువుల కోసం వాటా కేటాయించినట్టు తెలుస్తోంది. బట్లర్ సుబ్బయ్య మూడు దశాబ్దాలకు పైగా రతన్ టాటా వద్ద పనిచేశారు. వంటపని చేసే రాజన్, బట్లర్ సుబ్బయ్యకు రతన్ టాటా తనతో పాటు విదేశాలకు వెళ్లినప్పుడు ఇద్దరికీ డిజైనర్ దుస్తులు కొనేవారు. కుక్కలు, పెంపుడు జంతువుల పట్ల తనకున్న ప్రేమను ఎప్పటికీ దాచుకోలేని రతన్ టాటా, తన ప్రియమైన టిటో మరణానంతరం పెంపుడు జీవాలకు 'అపరిమిత సంరక్షణ' అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసారు. రతన్ టాటా తన ఫౌండేషన్‌ను సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్, ఇంట్లో పనిచేసే సిబ్బంది, ఇతరులకు ఆస్తులను విరాళంగా ఇచ్చారు. టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్డులో రెండంతస్తుల ఇల్లు ఉన్నాయి. రూ. 350 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో 0.83 శాతం వాటా ఉన్నాయి. ఆయన వీలునామా త్వరలో బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. టాటాకు చెందిన వివిధ అవార్డులు, గుర్తింపులు టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌కు విరాళంగా చేరతాయి. వాటిని రతన్ టాటా వారసత్వంగా రాబోయే తరాలకు భద్రపరుస్తారు.

Advertisement

Next Story

Most Viewed