Stock Market: వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతుతో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా గురువారం వరుసగా మూడో రోజు లాభాలను సాధించాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటాతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనివల్ల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఇజ్రాయెల్, హమాస్ సానుకూల పరిణామాలు, దేశీయంగా తగ్గిన వాణిజ్య లోటు, ప్రధాన మెటల్, ఎనర్జీ షేర్లలో ర్యాలీ కారణంగా సూచీలు రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 318.74 పాయింట్లు లాభపడి 77,042 వద్ద, నిఫ్టీ 98.60 పాయింట్లు పెరిగి 23,311 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా ప్రధాన రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి షేర్లు లాభాలను సాధించాయి. హెచ్‌సీఎల్ టెక్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.56 వద్ద ఉంది.

Next Story

Most Viewed