సెన్సెక్స్ @72000

by srinivas |
సెన్సెక్స్ @72000
X

ముంబై: భారత షేర్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారిగా 72,000 మైలురాయిని అధిగమించగా నిఫ్టీ 21,650 ఎగువకు చేరింది. దేశీయ, అంతర్జాతీయ స్థూల ఆర్ధికాంశాల్లో సానుకూలతలతో పాటు వచ్చే ఏడాది అమెరికా ఫెడ్‌ రేట్ల తగ్గింపు సంకేతాలతో ఆటో, బ్యాంకింగ్, మెటల్‌ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడం ఇందుకు దోహదపడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల జోరు మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి.

వరుసగా నాలుగో రోజు పుంజుకున్న తర్వాత బుధవారం సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై 72,119, నిఫ్టీ 21,675 మార్కును తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు సూచీల కొత్త రికార్డు గరిష్ఠాలకు కీలక మద్దతుగా నిలిచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 701.63 పాయింట్లు ఎగసి 72,038 వద్ద, నిఫ్టీ 213.40 పాయింట్లు లాభపడి 21,654 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను చూశాయి. మిగిలిన అన్నీ లాభపడ్డాయి.

ముఖ్యంగా ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్ స్టాక్స్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.34 వద్ద ఉంది. మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా సరికొత్త జీవనకాల రికార్డు స్థాయికి చేరుకుంది. బుధవారం ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్ల వృద్ధితో రూ.361.4 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed