- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stock Market: మార్కెట్లకు రుచించని ఆర్‌బీఐ నిర్ణయం.. వరుసగా మూడోరోజూ నష్టాలే

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీఎసీ సమావేశంలో కీలక రెపో రేటును తగ్గించినప్పటికీ మార్కెట్లకు రుచించలేదు. ఊహించిన విధంగానే రేట్లు తగ్గించి, వృద్ధి పెరిగేందుకు ఆర్‌బీఐ సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే, పాలసీ విధానంలో తటస్థ వైఖరిని కొనసాగించడంతో పాటు ఊహించిన విధంగా లిక్విడిటీ చర్యలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని పెట్టుబడిదారులు భావించారు. కానీ, ఆ దిశగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. ఫలితంగా కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లపై ఎక్కువ ఒత్తిడి కనిపించింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్య పరిణామాలు, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా గ్లోబల్ మార్కెట్లు బలహీన సంకేతాలిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 197.97 పాయింట్లు క్షీణించి 77,860 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు నష్టపోయి 23,559 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో రంగాలు మినహా మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, జొమాటో షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.79 వద్ద ఉంది.