ఫిబ్రవరి రిటైల్ వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి!

by Harish |
ఫిబ్రవరి రిటైల్ వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి!
X

చెన్నై: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ వాహన పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తాజా గణాంకాల ప్రకారం, గత నెలలో ద్విచక్ర వాహనాలతో పాటు ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా పుంజుకోవడంతో మొత్తం రిటైల్ అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఫిబ్రవరిలో మొత్తం 17,75,424 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది 2022, ఫిబ్రవరిలో అమ్ముడైన 15,31,196 యూనిట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి. అయితే, మొత్తం వాహనాల విక్రయాలు కరోనాకు ముందు 2020, ఫిబ్రవరితో పోలిస్తే 8 శాతం తక్కువగానే ఉన్నాయి.

ప్రధానంగా కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, బుకింగ్-టూ-క్యాన్సిల్ విధానంతో పాటు సరఫరా మెరుగుపడటం, వివాహ సీజన్ కారణంగా వాహన రిటైల్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని ఫాడా తెలిపింది. సమీక్షించిన నెలలో ప్యాసింజర్ కార్ల రిటైల్ విక్రయాలు 2,87,182 యూనిట్లతో 11 శాతం పెరగ్గా, ద్విచక్ర వాహనాలు 15 శాతం, త్రీ-వీలర్ 81 శాతం, ట్రాక్టర్లు 14 శాతం, వాణిజ్య వాహనాలు 17 శాతం వృద్ధిని సాధించాయి.

టూవీలర్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలోనే వృద్ధి చెందినప్పటికీ కరోనా మహమ్మారికి ముందు 2020, ఫిబ్రవరితో పోలిస్తే ఇంకా 14 శాతం తక్కువగానే విక్రయించబడ్డాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌రాజ్‌ సింఘానియా అన్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఉద్గార ప్రమాణాలు ఏప్రిల్ నుంచి అమలు కానుండటం, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే టూ వీలర్ అమ్మకాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story