ULI: సులభ రుణాలకు ఆర్‌బీఐ కొత్త ప్లాట్‌ఫామ్

by S Gopi |
ULI: సులభ రుణాలకు ఆర్‌బీఐ కొత్త ప్లాట్‌ఫామ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సరికొత్త సేవలను ప్రారంభించనుంది. రుణాలను సులభంగా తీసుకునేందుకు వీలుగా యూపీఐ తరహాలో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్(యూఎల్ఐ)ను త్వరలో తీసుకొస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాస్.. గతేడాది 'ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్' పేరుతో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని, అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా వీటిని సేవలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వినియోగదారుల ఆర్థిక, ఆర్థికేతర డేటా వివరాల డిజిటల్ యాక్సెస్‌ను అందిస్తుంది. భూ రికార్డులతో సహా అన్ని ఒకేచోట లభిస్తాయి. ముఖ్యంగా రైతులు, ఎంఎస్ఎంఈలకు ఇబ్బందుల్లేని క్రెడిట్ సౌకర్యం అందించేందుకు స్టోరేజ్‌లా యూఎల్ఐ ఉపయోగపడుతుందని దాస్ వివరించారు.

యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దేశ చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లే యూఎల్ఐ దేశంలో రుణాల విధానాల్లో మార్పులు తీసుకొస్తుందని దాస్ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐకున్న ప్రాధాన్యత మాదిరిగానే రుణాలివ్వడంలో యూఎల్ఐ కీలక పాత్ర పోషిస్తుంది. భారత డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో యూఎల్ఐ కీలకంగా ఉండనుందని దాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, బ్యాంకుల వద్ద డేటా అందుబాటులో ఉన్నందున క్రెడిట్ వివరాలకు ఇబ్బందుల్లేవు. యూఎల్ఐ ద్వారా క్రెడిట్ డేటా తీసుకునే సమయాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్న, గ్రామీణ రుణగ్రహీతల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్ ద్వారా యూఎల్ఐ పనిచేయడం వల్ల రుణాలు మంజూరు చేసే ప్రక్రియ సులభంగా మారుతుంది. లోన్ కావాలంటే డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని దాస్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed