RBI: వరుసగా 11వ సారి కీలక రేట్లు యథాతథం

by S Gopi |
RBI: వరుసగా 11వ సారి కీలక రేట్లు యథాతథం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంచనాలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముగిసిన ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 4న మొదలైన ఎంపీసీ సమావేశం శుక్రవారంతో ముగిసింది. ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక రెపో రేటును ఇప్పుడున్న 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్టు చెప్పారు. దీంతో 2023, ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ వరుసగా 11వ సారి రెపో రేటును ఇదే రేటు వద్ద కొనసాగిస్తోంది. మీడియాతో మాట్లాడిన దాస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పరిమితమైందని, దీని కారణంగా గత ఎంపీసీ సమావేశంలో భారత వృద్ధి రేటును అంచనా వేసిన 7.2 శాతం నుంచి వాస్తవ జీడీపీ రేటు అంచనాను 6.6 శాతంగా అంచనా వేసింది. పండుగ డిమాండ్, పెరిగిన గ్రామీణ కార్యకలాపాల పునరుద్ధరణతో కార్యకలాపాలు అట్టడుగు స్థాయి నుంచి పుంజుకున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని, రానున్న రోజుల్లో వృద్ధి మెరుగుపడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచుతూ ఎంపీసీ సభ్యులు అంచనా వేశారు. ప్రధానంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ అంచనాను పెంచినట్టు దాస్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా బలహీన పడుతున్న భారత కరెన్సీ రూపాయిని బలోపేతం చేయడానికి ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పరిమితిని పెంచుతున్నామని దాస్ స్పష్టం చేశారు. అలాగే, వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని ఎంపీసీ సభ్యులు నిర్ణయించారు. క్యాష్ రిజర్వ్ రేషియోను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం ద్వారా బ్యాంకులకు రూ. 1.16 లక్షల కోట్ల నగదును అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆర్‌బీఐ పాడ్‌క్యాస్ట్..

దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఏఐ ఆధారిత మోడల్‌పై పనిచేస్తున్నామని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా యూపీఐపై క్రెడిట్ లైన్‌ అందించే అవకాశం కల్పిస్తున్నట్టు దాస్ వెల్లడించారు. అంతేకాకుండా దేశంలోని ప్రజలకు, సెంట్రల్ బ్యాంకుకు మధ్య కమ్యూనికేషన్ మరింత మెరుగుపడేందుకు ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకుంది. త్వరలో ఆర్‌బీఐ పాడ్‌క్యాస్ట్‌లు ప్రారంభిస్తామని, సెంట్రల్ బ్యాంకు సమాచారం విస్తృతంగా చేరడానికి, పారదర్శకతను పెంచేందుకు వీలుగా దీన్ని అమలు చేయనున్నట్టు దాస్ వెల్లడించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed