RBI: ఈసారి కూడా యథాతథంగా వడ్డీ రేట్లు: నిపుణులు

by S Gopi |
RBI: ఈసారి కూడా యథాతథంగా వడ్డీ రేట్లు: నిపుణులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు తగ్గడంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్ 4-6 తేదీల మధ్య జరగనున్న ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో కీలక రేట్లు యథాతథంగా ఉంచవచ్చని అంచనా. ఆర్‌బీఐ త్వరలో కీలక రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవలి రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల్లో ఆర్‌బీఐ లక్ష్యం 6 శాతం కంటే ఎక్కువగా నమోదవడంతో తగ్గింపు నిర్ణయం తీసుకోకపోవచ్చు. ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు సమావేశ నిర్ణయాలపై ప్రభావం చూపనున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్‌లో కార్యకలాపాలు పెరగడం, వినియోగం పుంజుకోవడం వంటి పరిణామాలతో 2024-25 ద్వితీయార్థంలో వృద్ధి మెరుగుపడవచ్చు. ప్రధానంగా ద్రవ్యోల్బణం, అనిశ్చితంగా ఉన్న అంతర్జాతీయ అంశాల ఆధారంగా ఆర్‌బీఐ నిర్ణయాలు ఉంటాయని నిపుణులు వెల్లడించారు.

Advertisement

Next Story