RBI: మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం

by S Gopi |
RBI: మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. ఐదేళ్ల తర్వాత గత ఫిబ్రవరి నాటి ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈసారి సమావేశంలో సైతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దశలోనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికాకు కీలక ఎగుమతిదారుగా ఉన్న భారత్‌లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, దేశీయంగా వినియోగం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కొనసాగించేందుకు ఆర్‌బీఐ రేట్ల కోతపై సానుకూలంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed