సెబీ చీఫ్ మాధవి బుచ్‌పై ఆరోపణలు అవాస్తవం

by S Gopi |
సెబీ చీఫ్ మాధవి బుచ్‌పై ఆరోపణలు అవాస్తవం
X

దిశ, బిజినెస్ బ్యూరో: వరుసగా వివాదాలను ఎదుర్కొన్న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌కు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సెబీ బాధ్యతల్లో ఉండి ప్రయోజనాలు పొందారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వం అవన్నీ అవాస్తవాలని, క్లీన్ చిట్ ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ దర్యాప్తులో మాధబి పురి బుచ్, ఆమె కుటుంబసభ్యులు ఎవరి వద్ద కూడా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్ధారించిందని జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేని కారణంగా వారిపై చర్యలు ఉండవని, మాధవి బుచ్ తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల అదానీ గ్రూపునకు చెందిన విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ ప్రకటించింది. దీని తర్వాత సెబీ చీఫ్ హోదాలో ఉండి కూడా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వేతనం తీసుకున్నారని, మరో కంపెనీతో ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. అవన్నీ తప్పుడు ఆరోపణలనీ, ఉద్దేశపూర్వకంగా తన గౌరవాన్ని తగ్గించేందుకు చేసినవని ఆమెతో పాటు ఆమె భర్త ధావల్ బుచ్ ప్రకటన విడుదల చేశారు. కాగా, సెబీ ఛైర్‌పర్సన్‌గా మాధవి పురి బుచ్ పదవీ కాలం 2025, ఫిబ్రవరితో ముగియనుంది.

Advertisement

Next Story