Retail Inflation: 14 నెలల గరిష్ఠానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
Retail Inflation: 14 నెలల గరిష్ఠానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మరోసారి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్దేశించిన లక్ష్యం దాటి వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 5.49 శాతం నమోదవగా, గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతం ఉన్న సంగతి తెలిసిందే. కీలక రంగాల్లో ధరల ఒత్తిడి కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగిందని గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం మరోసారి అత్యధికంగా పెరిగింది. ప్రధాన కూరగాయలు, వంటనూనె ధరల ఒత్తిడి కారణంగా ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 10.87 శాతం నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో ఆహార పదార్థాల ధరలు 6.61 శాతంగా ఉంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం వృద్ధి చెందింది. కీలక తయారీ కార్యకలాపాలు పుంజుకోవడమే ఇందుకు కారణమని ఎన్‌ఎస్‌ఓ డేటా తెలిపింది. ఇదే నెలలో తయారీ రంగ ఉత్పత్తి 3.9 శాతం, విద్యుదుత్పత్తి 0.5 శాతం, మైనింగ్ 0.2 శాతం పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed