అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా ఎదగడమే లక్ష్యం: అదానీ ఎయిర్‌పోర్ట్స్!

by Harish |
అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా ఎదగడమే లక్ష్యం: అదానీ ఎయిర్‌పోర్ట్స్!
X

న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ దేశంలోనే అగ్రగామి ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు సంస్థ సీఈఓ అరుణ్ బన్సాల్ అన్నారు. అందుకోసం దేశంలోని మరిన్ని విమానాశ్రయాల నిర్వహణకు వేలం వేయనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో కేంద్రం దాదాపు డజను వరకు విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అవకాశం ఉందని, దానికోసం బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని బుధవారం జరిగిన ఏవియేషన్ కన్సల్టెన్సీ సీఏపీఏ కార్యక్రమంలో బన్సాల్ వెల్లడించారు.

ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ దేశవ్యాప్తంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తుండగా, మరొకటి నిర్మిస్తోంది. ఇదే సమయంలో రాబోయే కొన్నేళ్లలో దేశీయ విమానాశ్రయాల నిర్వహణ ఖర్చు 30-50 శాతం మేర తగ్గుతుందని అరుణ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు. భారత విమానయాన మార్కెట్‌కు గణనీయమైన వృద్ధి సాధించే సామర్థ్యం ఉందన్నారు. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించాలని భావిస్తున్నామని, అదానీ ఎయిర్‌పోర్ట్స్ అవసరమైన అన్ని రకాల పెట్టుబడులను పెడుతోంది. సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మరింత విస్తరిస్తామని ఆయన వివరించారు.

గత 20-30 ఏళ్ల నుంచి తాము భారత విమానయాన రంగంలో కీలకంగా ఉన్నాము. రాబోయే కొన్నేళ్ల విమానాశ్రయాల నిర్వహణ వ్యయం దాదాపు సగానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు బన్సాల్ పేర్కొన్నారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానాశ్రయ ఆపరేటర్ల ఆదాయం 26 శాతం పెరిగి సుమారు రూ. 33 వేల కోట్లకు చేరుకుంటుందని సీఏపీఏ అంచనా వేసింది. అలాగే, విమాన ప్రయాణీకుల రద్దీ 39.5 కోట్లుగా ఉంటుందని పేర్కొంది.

Advertisement

Next Story