ప్రధాన పథకాలకు భారీగా పెంచిన కేటాయింపులు

by S Gopi |   ( Updated:2024-02-01 11:01:43.0  )
ప్రధాన పథకాలకు భారీగా పెంచిన కేటాయింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం పలు ప్రధాన పథకాలకు కేటాయింపులను భారీగా పెంచింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు పునాది వేయాలనే లక్ష్యంతో దేశంలోని మహిళలు, పేదలు, రైతులు, యువత అనే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా చర్యలను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ 2.0కి ఇది చివరి బడ్జెట్.

ప్రధాన పథకాలకు జరిగిన కేటాయింపులు..

* మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ).. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం కేంద్రం రూ. 60,000 కోట్లను కేటాయించింది. తాజా మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.86,000 కోట్లతో 43.33 శాతం పెంచింది.

* ఆయుష్మాన్ భారత్(పీఎంజేఏవై) పథకానికి సైతం ఈసారి 4.2 శాతం అధికంగా రూ. 7,500 కోట్లను కేటాయించారు. 2023-23లో ఈ పథకం కింద రూ. 7,200 కోట్లు కేటాయించారు.

* ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,645 కోట్ల నుంచి 33.48 శాతం పెంచి రూ. 6,200 కోట్లను కేటాయించారు.

* సెమీకండక్టర్స్, డిస్‌ప్లే తయారీల అభివృద్ధికి ఏకంగా 130 శాతం పెంచి రూ. 6,903 కోట్లకు పెంచారు. 2023-24లో ఇందులో రూ. 3,000 కోట్లు కేటాయించారు.

* సోలార్ పవర్ గ్రిడ్ కోసం క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ. 4,970 కోట్ల నుంచి రూ. 8,500 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 71 శాతం పెరుగుదల.

* నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం కేటాయింపులను రూ. 297 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు పెంచారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 102 శాతం అధికం.

Advertisement

Next Story