Manufacturing PMI: నాలుగు నెలల కనిష్టానికి తయారీ పీఎంఐ!

by Prasanna |
Manufacturing PMI: నాలుగు నెలల కనిష్టానికి తయారీ పీఎంఐ!
X

న్యూఢిల్లీ: భారత తయారీ రంగ కార్యకలాపాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు నెలల కనిష్టానికి క్షీణించింది. ముఖ్యంగా పెరుగుతున్న రుణ వ్యయం, తయారీలో ఇన్‌పుట్ ఖర్చులు మరింత పెరగడం, విదేశాల నుండి కొత్త ఆర్డర్‌లు ఓ మోస్తరుగా మాత్రమే పెరగడంతో గత నెలలో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) స్వల్పంగా 55.3 పాయింట్లుగా నమోదైంది. అంతకుముందు జనవరిలో పీఎంఐ సూచీ 55.4 పాయింట్లుగా నమోదైంది. ఇది వరుసగా 20వ నెలలో 50 మార్కు కంటే ఎక్కువగా నమోదైంది. సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎగువన ఉంటే వృద్ధిగానూ, దిగువన ఉంటే క్షీణతగానూ పరిగణిస్తారు. అయితే, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ డిమాండ్ మద్దతుతో తయారీ రంగం ఇంకా పటిష్ఠంగానే ఉంది. అంతకుముందు రోజు మంగళవారం భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి పరిమితమైంది. సమీక్షించిన కాలానికి తయారీ రంగం ఎగుమతుల్లో బలహీనత కారణంగా 1.1 శాతం క్షీణించింది. కంపెనీలు డిమాండ్ పెరుగుదలపై సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ కొత్త ఆర్డర్లు పాక్షికంగా మాత్రమే పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ కొత్త వ్యాపార వృద్ధి కీలకం కానుందఅని ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియన డి లిమా పేర్కొన్నారు.

Advertisement

Next Story