మొట్టమొదటిసారి రూ. 1,000 మార్కు దాటిన ఎల్ఐసీ

by S Gopi |
మొట్టమొదటిసారి రూ. 1,000 మార్కు దాటిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్ కార్పొరేషన్(ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలో కొత్త మైలురాయిని అధిగమిచింది. సోమవారం ట్రేడింగ్‌లో ఎల్ఐసీ షేర్లు 7 శాతానికి పైగా పుంజుకోవడంతో మొదటిసారిగా రూ. 1,000 మార్కును దాటాయి. ఇంట్రాడేలో షేర్లు 8.8 శాతం పెరగడంతో రికార్డు గరిష్ఠం రూ. 1,028ని తాకాయి. గతేడాది నవంబర్‌లో ఎల్ఐసీ షేర్లు 12.83 శాతంతో భారీగా లాభపడ్డాయి. ఆ తర్వాత డిసెంబర్ నెలలో 22.52 శాతం, జనవరిలో 14 శాతం పెరిగి జోరును కొనసాగించాయి. ఈ జనవరి 23న కంపెనీ షేర్లు రూ. 949 వద్ద ఐపీఓ ధరలను అధిగమించాయి. అప్పటినుంచి ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఎల్ఐసీ సంస్థ ఫిబ్రవరి 6న తన కొత్త ఇండెక్స్ ప్లస్ పాలసీని విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది యూనిక్ లింక్‌డ్, నాన్-పార్టిసిపేటింగ్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ కారణంతో కంపెనీ షేర్ రికార్డు గరిష్ఠాల్లో ట్రేడవుతోంది. ఇదే సమయంలో ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ సైతం రూ. 6.50 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశంలో ఆరవ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ, అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా అగ్రస్థానంలో నిలిచింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఎల్ఐసీ షేర్ ధర 7 శాతం పెరిగి రూ. 1,012 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలతో దాని మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపిస్తోంది. సోమవారం కంపెనీ షేర్ 10 శాతం పడిపోయి రూ. 438.50 వద్ద ఉంది. దీంతో వరుస పతనంతో మార్కెట్‌ విలువ కూడా రూ.20 వేల కోట్ల వరకు క్షీణించింది.

Advertisement

Next Story