- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: ఒక్కరోజే రూ. 11.19 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. గత వారం కొంత సానుకూలంగా కనిపించిన ర్యాలీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనతో తిరిగి బలహీనపడ్డాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ప్రతికూలంగా మారడం, అత్యధిక సుంకాల విధింపుతో ఆసియా మార్కెట్లలోనూ సెంటిమెంట్ దెబ్బతినడం, దేశీయంగా కీలక ఫార్మా, ఐటీ వంటి రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ 76 వేల దిగువకు, నిఫ్టీ 23 వేల దిగువకు చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సైతం ఒక్కరోజే రూ. 11.19 లక్షల కోట్లు కోల్పోయారు. ప్రధానంగా ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలను ప్రారంభించగా, చైనా, కెనడా, పలు యూరప్ దేశాలు సైతం బదులుగా ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు నీరసించాయి. దీనికితోడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో మాంద్యం ఏర్పడవచ్చనే సంకేతాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా మార్కెట్లు 2020 కొవిడ్ మహమ్మారి నాటి స్థాయిలో దెబ్బతినడం కొంత ఆందోళనలు పెంచింది. మరోవైపు, మనదేశంలోనూ కీలక రంగాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా త్వరలో ఫార్మా రంగ ఉత్పత్తులపైనా సుంకం ఉంటుందని, ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో ఉంటుందని ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భంలో పేర్కొనడం మన ఫార్మా షేర్లలో కుదుపులకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 930.67 పాయింట్లు క్షీణించి 75,364 వద్ద, నిఫ్టీ 345.65 పాయింట్లు నష్టపోయి 22,904 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.