IRCTC: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం

by S Gopi |
IRCTC: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆదివారం చాలామంది వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమాచారం. దీని గురించి కస్టమర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అంతకుముందు రోజు శనివారం కూడా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ప్రముఖ వెబ్‌సైట్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 460 రిపోర్టులు అందాయి. అయితే, నిర్వహణ పనుల కారణంగా టికెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడిందని సంస్థ వివరణ ఇచ్చింది. మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి క్రమంలో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సంస్థ చెబుతున్నప్పటికీ, వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియా అని క్లెయిమ్ చేసుకునే కంటే ముందు ఇలాంటి సాధారణ సమస్యలను పరిష్కరించాలని కొందరు అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యవధిలో ఐదుసార్లు ఈ సమస్య పునరావృతం కావడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన తరాత నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ అవుతోంది. ఎక్కువమంది టికెట్లను బుక్ చేసుకోలేకపోతున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. గత నెలలోనూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డిసెంబరు 26న ఒకసారి, డిసెంబరు 31న రెండుసార్లు ఇదే తరహా అంతరాయం ఏర్పడింది.

Next Story

Most Viewed