Infosys: 400 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

by S Gopi |
Infosys: 400 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల కంపెనీ తన మైసూర్ క్యాంపస్‌లో పనిచేస్తున్న సుమారు 400 మంది ట్రైనీలను తొలగించింది. దీని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక యూనియన్లు కంపెనీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బలవంతంగా ఉద్యోగులను తొలగించడంపై ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)కు 100కు పైగా ఫిర్యాదులు చేసినట్టు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఇన్ఫోసిస్ వ్యవహారంపై జోక్యం చేసుకుని ఉద్యోగులను తిరిగి చేర్చుకునేలా ఒప్పించాలని, భవిష్యత్తులోనూ ఇటువంటి లేఆఫ్ నిర్ణయం తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక శాఖ చర్యలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కర్ణాటక కార్మిక శాఖకు ఇప్పటికే నోటీసులు కూడా పంపినట్టు సమాచారం. రాష్ట్ర అధికారులు దర్యాప్తు జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఈ నెల ప్రారంభంలో ఇన్ఫోసిస్ కంపెనీ తన మైసూర్ క్యాంపస్‌లోని 400 మంది ట్రైనీలను తొలగించింది. తక్షణం క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని కూడా స్పష్టం చేసింది. వీరందరూ 2022-23 నాటి 2,000 నియామకాల్లో భాగంగా చేరినవారు. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్, సిస్టమ్ ఇంజనీర్ సహా పలు విభాగాల్లో కంపెనీ వారికి ఆఫర్ లేటర్లు ఇచ్చింది. కంపెనీ చేపట్టే అన్ని పరీక్షలను పూర్తి చేసినప్పటికీ కంపెనీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. గతేడాది ఏప్రిల్‌లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ, మైసూర్ క్యాంపస్‌లోని 400 మంది మూడు ఎవల్యూయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తొలగించింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే ట్రైనీలతో కలిసి నిరసన చేపట్టేందుకు వెనుకాడబోమని పూణేకు చెందిన ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ స్పష్టం చేసింది. ఉద్యోగులకు తగిన న్యాయం, గౌరవం లభించే వరకు వారికి అండగా ఉంటామని పేర్కొంది.



Next Story

Most Viewed