Reciprocal Tariff: పరస్పర సుంకాల ముప్పు పరిష్కారానికి 'జీరో ఫర్ జీరో' ప్రతిపాదన

by S Gopi |
Reciprocal Tariff: పరస్పర సుంకాల ముప్పు పరిష్కారానికి జీరో ఫర్ జీరో ప్రతిపాదన
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా కొత్త అనుసరిస్తున్న రెసిప్రోకల్ టారిఫ్ ముప్పు పరిష్కారానికి భారత్ 'జీరో ఫర్ జీరో ' అనే వ్యూహాన్ని ప్రతిపాదించాలని ప్రముఖ థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ అభిప్రాయపడింది. శుక్రవారం సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు ప్రతిపాదనలను పేర్కొంది. భారత ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కంటే ఈ విధానం భారత ఉత్పత్తులపై తక్కువ హానీ కలిగిస్తుంది. 'జీరో ఫర్ జీరో' విధానం కింద ప్రభుత్వం దేశీయ పరిశ్రమలు, వ్యవసాయాన్ని ప్రభావితం చేయకుండా అమెరికా దిగుమతులపై దిగుమతి సుంకాలని తొలగించవచ్చు. దానికి బదులుగా అమెరికా కూడా ఇదే సంఖ్యలో వస్తువులపై సుంకాన్ని మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ జాబితా నుంచి భారత్ వ్యవసాయ వస్తువులను మినహాయించవచ్చు. ఇదే ప్రతిపాదనను జపాన్, కొరియా, ఆగ్నేయాసియా దేశాల ముందు కూడా ఉంచొచ్చు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లోపు అమెరికాతో చర్చించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. దీన్ని అమెరికా అంగీకరిస్తే పరస్పర సుంకం ప్రభావం తక్కువగా ఉంటుందని, భారత్‌పై సుంకాలు అత్యల్పంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఒకవేళ అమెరికా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, సుంకాలు అసలు సమస్య కాదని, ఇతర రంగాల్లో రాయితీల కోసం భారత్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహమని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. అమెరికా పరస్పర సుంకాన్ని విధిస్తే, భారతీయ ఎగుమతులు ప్రస్తుతం ఉన్న 2.8 శాతంతో పోలిస్తే 4.9 శాతం అదనపు సుంకం భారాన్ని మోయాల్సి ఉంటుందని వివరించింది. రంగాలవారీగా సుంకాలు విధిస్తే, భారతీయ వ్యవసాయ ఎగుమతులు ఎక్కువ ప్రభావితం కానున్నాయి. రొయ్యలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు 38 శాతం వరకు సుంకాలు ఎదుర్కొంటున్నాయి. ఫార్మాస్యూటికల్స్, వజ్రాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి పారిశ్రామిక వస్తువులు కూడా ఎక్కువ నష్టాలను చూడవచ్చని జీటీఆర్ఐ పేర్కొంది.


Next Story

Most Viewed